Saturday, November 23, 2024

FollowUp: 3.14 కోట్ల రూపాయ‌ల సీజ్ చేసిన మద్యం ధ్వంసం.. రోడ్డు రోల‌ర్ల‌తో తొక్కించిన అధికారులు

నెల్లూరు (క్రైం), ప్రభ న్యూస్‌ : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పోలీస్‌స్టేషన్‌ల పరిధిల్లో, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారుల దాడుల్లో సీజ్ చేసిన‌ రూ.3, 14 కోట్ల విలువైన‌ మద్యాన్ని మంగళవారం జిల్లా ఎస్పీ సీహెచ్‌. విజయరావు, సెబ్‌ జేడీ కె. శ్రీలక్ష్మి పర్యవేక్షణలో ధ్వంసం చేశారు. మూడేళ్లుగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు, సెబ్‌ అధికారులు వివిధ ప్రాంతాల్లో దాడులు చేసి సీజ్‌ చేసిన 2774 కేసుల్లో రూ.3 కోట్ల 14 లక్షల 37 వేల 980 విలువ చేసే 74,574 మద్యం బాటిళ్లు సుమారుగా 15,719 లీటర్లను కొత్తూరులోని టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయం ప్రాంగణంలో రోడ్డు రోలర్లతో మద్యం సీసాలను తొక్కించి ధ్వంసం చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ సీహెచ్‌. విజయరావు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా పోలీసులు, సెబ్‌ అధికారులు ఎంతో సమన్వయంతో పనిచేస్తూ నిరంతరం ఏదోఒక ప్రాంతంలో అనధికార, పొరుగు రాష్ట్రాల మద్యం, నాటుసారా విక్రయాలపై దాడులు నిర్వహిస్తున్నారన్నారు. స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహిస్తూ చీకటి కార్యకలాపాలను కట్టడి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఇన్‌చార్జ్‌ ఏసీ రవికుమార్‌, ఏఈఎస్‌ క్రిష్ణకిషోర్‌రెడ్డి, డీఎస్పీలు వై. హరనాధ్‌రెడ్డి, ఎన్‌. కోటారెడ్డి, సెబ్‌ ఇన్‌స్పెక్టర్లు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement