Thursday, November 21, 2024

మ‌రో 35 మంది వైసిపి ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్..

నెల్లూరు, ప్రభన్యూస్‌ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాలతోనే తన ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని, అందులో ఎటువంటి సందేహం లేదని అధికారులు, ప్రభుత్వ పెద్దలు చెప్పకపోతే ఫోన్‌ ట్యాపింగ్‌ చేయాల్సిన అవ సరం వారికి ఉండదని నెల్లూరు గ్రామీణ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి మరోసారి వైసీపీ అధిష్టానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించిన సాక్ష్యాన్ని మీడియాకు చూపించారు. పార్టీ రీజనల్‌ కో-ఆర్డినేటర్‌ బాలినేని శ్రీనివాసుల రెడ్డి తనను రెచ్చగొట్టబట్టే అధికారి పేరు బయటపెట్టాల్సి వచ్చిందని లేకపోతే తనకు ఆ ఆలోచనే ఉండేది కాదన్నారు. ఆయన ఈ సందర్భంగా ఇంటెలిజెన్స్‌ ఐజీ సీతారామాంజేయులు ఫోన్‌ నుంచి తనకు పంపిన సందేశాన్ని మీడియా ముందు వినిపించారు. అందుకు సంబంధించిన ఫోన్‌ నెంబర్‌ 98499 66000 కూడా చూపించారు. అయితే ఐజీ తనను హెచ్చరించడానికి ఫోన్‌ ట్యాపింగ్‌ అంశాన్ని ప్రస్తావించారా..? లేక మరో ఉద్దేశంతో చెప్పారా తనకు తెలియదు కానీ అధిష్టాన పెద్దల ఆదేశాలతోనే తన ఫోన్‌ ట్యాపింగ్‌ జరుగుతుందని నిర్ధారణ అయిందన్నారు. అందుకే నమ్మకం లేని పార్టీలో ఉండటం ఇష్టం లేక బయటకు వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకున్నానన్నారు.

నమ్మకం లేనిచోట.. ఉండకూడదనుకున్నా..
తన జీవితంలో ఇలాంటి సమావేశం పెట్టాల్సి వస్తుందని అనుకోలేదన్నారు. వై.సి.పి. ఆవిర్భావానికి ముందు నుంచే జగన్‌ వెన్నంట ఉన్నానన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలవడంతో పాటు ఓ సైనికుడిలా పనిచేశానన్నారు. జగన్‌ అన్నా, వైఎస్‌ కుటుంబమన్నా తనకెంతో అభిమానమని అయితే నమ్మకం లేని చోట ఉండకూడదని నిర్ణయం తీసుకున్నానన్నారు. ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నపుడు చిత్త శుద్దితో పని చేసి అధికారంలోకి వచ్చిన తరువాత గుర్తింపు కోరుకున్నానన్నారు. అయితే ఆ దిశగా పార్టీలో గుర్తింపు ఇవ్వకపోయినా ప్రజల కోసం పని చేస్తూ వస్తున్నానన్నారు. ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానన్నారు. బారా షాహిద్‌ దర్గాకు జగన్‌ నిధులు మంజూరు చేసినా ఆర్థిక శాఖ విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక శాఖకార్యదర్శి రావత్‌ తీరును పలు సమావేశాల్లో నిలదీశానన్నారు. అయినా పార్టీకి వీర విధేయుడైన నన్ను కొంతమంది అధికారులు ఇబ్బంది పెట్టారన్నారు. ఇదే విషయాన్ని ఇటీవల సీఎం జగన్‌ కలిసినప్పుడు కూడా చెప్పానన్నారు.

మీ ఫోన్లు ట్యాప్‌ చేస్తే..
సీఎం జగన్‌, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయ్‌ సాయి రెడ్డి ఫోన్లను కేంద్రం ట్యాప్‌ చేసినట్లు- మీకు ఆధారాలు వస్తే మీ స్పందన ఎలా ఉంటు-ంది..? ఈ విషయంలోముఖ్యమంత్రి ఆలోచించాలన్నారు. తాను ఐఫోన్‌ వాడుతున్నానని, తన మిత్రుడు లంకా రామశివారెడ్డి ఫోన్‌ చేస్తే మాట్లాడానని ఆయన ఫోన్‌ ఐ ఫోనే. రికార్డ్‌ చేసే అవకాశమే లేదన్నారు. అయితే రాష్ట్ర ఇం-టె-లిజెన్స్‌ ఐ.జి. సీతారామాంజనేయులు తనకు ఫోన్‌ చేసి తన ఫోన్‌ ట్యాప్‌ అవుతోందని చెప్పారన్నారు. అందుకు సంబంధించిన ఆడియో పంపారన్నారు. ఆ ఆధారంగానే ట్యాపింగ్‌ జరిగిందని నిర్ధారణకు వచ్చానన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే మీదే ట్యాపింగ్‌ జరిగిందంటే ఇక మంత్రులు, హైకోర్టు జడ్జీలు, న్యాయవాదులు, ఐ.ఏ.ఎస్‌.లు, ఐ.పి.ఎస్‌.లు, మీడియా ప్రతినిధులు, ఎం.పి.లు ఫోన్లు కూడా ట్యాప్‌ చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైతే ఈ విషయంలో కేంద్ర హోం శాఖకు కూడా ఫిర్యాదు చేస్తాన న్నారు.
తన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం బయటకొచ్చాక రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీకి చెందిన 35 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు, నలుగురు ఎంపీలు కూడా తనకు ఫోన్‌ చేసి వారి ఫోన్లు కూడా ట్యాపింగ్‌ జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారన్నారు. దీన్ని బట్టి చూస్తుంటే రాష్ట్రంలో అనేకమంది ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్‌ జరుగుతున్నాయని స్పష్టమవుతుందన్నారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని ట్యాపింగ్‌ వ్యవహారంపై కొంతమంది మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అది సరికాదన్నారు. ట్యాపింగ్‌ వ్యవహారంలో తన వద్ద ఉన్న సాక్ష్యాన్ని బయటపెట్టానన్నారు. అందులో సందేహముంటే అధికారంతో పాటు అన్ని వ్యవస్థలు చేతిలో ఉన్న ప్రభుత్వ పెద్దలు విచరణ జరిపించుకోవచ్చని ఆయన సవాల్‌ విసిరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement