Tuesday, November 26, 2024

ప్రణాళికా బద్దంగా బడ్జెట్ కేటాయింపులు: నెల్లూరు మేయర్

నెల్లూరు నగర పాలక సంస్థ 2022 – 23 ఆర్ధిక సంవత్సరానికి కేటాయించిన బడ్జెట్ అత్యంత ప్రణాళికా బద్ధంగా రూపొందించామని నగర మేయర్ పొట్లూరి స్రవంతి ప్రకటించారు. కార్పొరేషన్ లో బుధవారం జరిగిన బడ్జెట్ సమావేశాల అనంతరం విలేకరులతో మేయర్ మాట్లాడారు. 843 కోట్ల రూపాయలతో రూపొందించిన బడ్జెట్ లో నగర ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలను గుర్తిస్తూ, వాటి అభివృద్ధికి ప్రాధాన్యం కల్పించామని తెలిపారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన చెత్త సేకరణ వాహనాలతో, నగరంలో ఇప్పటి వరకు చేస్తున్న సంప్రదాయ పారిశుద్ధ్య నిర్వహణ విధానాలకు భిన్నంగా ఇంటింటి చెత్త సేకరణ అనే వినూత్న విధానాన్ని నగర వ్యాప్తంగా అమలు చేస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా సేకరించిన చెత్తను సేంద్రియ ఎరువులుగా రీసైక్లింగ్ చేసేందుకు అవసరమైన యూనిట్ల నిర్మాణానికి 18.75 కోట్ల రూపాయలను బడ్జెట్ లో కేటాయించామని మేయర్ తెలిపారు.నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్వహణకు 2 కోట్లు, మాగుంట లేఅవుట్ ప్రాంతంలో నిర్మిస్తున్న సైన్స్ పార్క్ నిధులకోసం 5 కోట్లు కేటాయించామని వెల్లడించారు. నగర పాలక సంస్థ నిర్వహణలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ ల పునరుద్ధరణ పనులకు 15 కోట్ల రూపాయలు మంజూరు చేసామని మేయర్ ప్రకటించారు. అదే విధంగా 15వ ఆర్ధిక సంఘం నిధులతో నగర వ్యాప్తంగా రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, అందులో భాగంగా కొన్ని ప్రాంతాల్లో పనులు సైతం ప్రారంభమయ్యాయని తెలియజేసారు. రానున్న రంజాన్ పండుగను నగర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మేయర్ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement