ముత్తుకూరు జూన్ 4 (ప్రభ న్యూస్) జిల్లాలోని తీర ప్రాంత గ్రామాలు బొగ్గు కాలుష్యంతో అతలాకుతలమవుతున్నాయి. తినే తిండి…. పీల్చే గాలి సర్వస్వం బొగ్గు మయంగా మారిపోయింది. సరిగ్గా 15 సంవత్సరాల క్రితం తీర ప్రాంత గ్రామాలు స్వచ్ఛమైన వాతావరణంతో సిరి సంపదలతో ఆర్థిక పరిపుష్టతో కలకలలాడుతూ ఉండేది. నేడు ఈ గ్రామాలు కలుషితం అయిన వాతావరణంతో…. చేతిలో చిల్లిగవ్వ లేక….. ప్రతి నిత్యం ఏదో ఒక కుటుంబంలో జబ్బులు…. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం తీర ప్రాంతం అయినప్పటికీ ఇక్కడ బొగ్గు కాలుష్యం వల్ల గ్రామాలు అనారోగ్యంతో ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణకు పారిశ్రామిక నిబంధనలను పాటించవలసిన పరిశ్రమల యాజమాన్యాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చట్టాలకు తూట్లు పొడుస్తూ ఉన్నారు. పారిశ్రామిక అభివృద్ధి ఎంత ముఖ్యమో పర్యావరణం పరిరక్షణ కూడా అంతే ముఖ్యం అనే విధంగా జాగ్రత్తలు తీసుకోవలసిన యాజమాన్యాలు లాభాలు చూసుకుంటున్నాయి తప్ప ప్రజల ఆరోగ్యాన్ని పంచుకోవట్లేదు. దీని మూలంగా ఇప్పటికే పలువురు వివిధ రకాల వ్యాధులతో స్మశానం బాట పట్టారు. పరిశ్రమలు కాలుష్యం గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేయవలసి ఉండగా నామమాత్రంగా చెట్లు పెంచారు. ఏదైనా పరిశ్రమకు భూములు కేటాయించినప్పుడు ఆ విస్తీర్ణంలో 30శాతం మేరకు గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేయవలసి ఉండగా కనీసం 15 శాతం కూడా గ్రీన్ బెల్ట్ పెంచలేదు. ఈ వ్యవస్థను చూడవలసిన కాలుష్యం నియంత్రణ మండలి అధికారులు కార్యాలయాలకు పరిమితమై కొంతమంది అధికారులు మాత్రమే లంచాల మత్తులో ఊగిసలాడుతున్నారు.
పరిశ్రమల కాలుష్యం మూలంగా తీర ప్రాంత గ్రామాలు తల్లడిల్లిపోతున్నాయి. ప్రధానంగా కృష్ణపట్నం ,నేలటూరు, పైన పురం, పంటపాలెం, ఈపూరు, పిడతాపోలూరు ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రైవేటు ధర్మల్ విద్యుత్ కేంద్రాలు, అదేవిధంగా ఆయిల్ ఉత్పత్తి, సిమెంట్ ఉత్పత్తి కర్మాగారాలు, ఫ్లై యాష్ కర్మాగారం, మరికొన్ని పరిశ్రమలు ముత్తుకూరు మండలంలో ఉన్నాయి. ప్రధానంగా ఈ కర్మాగారాల నుండి బయటకు వచ్చే కాలుష్యం ప్రజల జీవన విధానాన్ని అస్వస్థంగా తయారు చేసింది. కృష్ణపట్నం గ్రామ సమీపంలో ఉన్నటువంటి బొగ్గు రవాణా కేంద్రాలు శబ్ద కాలుష్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఈ రవాణా కేంద్రం ద్వారా బొగ్గు థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరఫరా అవుతుంది. గ్రామానికి సమీపంలోనే బొగ్గు గుట్టలు ఉండడం వల్ల గాలివాటం వీచినప్పుడు బొగ్గు పొడి గ్రామాల వైపు వ్యాపిస్తుంది. వాయు కాలుష్యం వల్ల ప్రజలు పడుతున్న బాధలు అంతా కాదు. ప్రతినిత్యం బొగ్గు కేంద్రాలను మంచినీటితో తడుపుతూ ఉండవలసిన యాజమాన్యాలు నామమాత్రంగా ఈ పని చేస్తూ ఉండటం వల్ల కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతూ ఉంది. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు శాఖపరమైన చర్యలు తీసుకోకపోవడం వల్ల కాలుష్యం గ్రామాలను కుమ్మేస్తుంది. దీంతో పర్యావరణం కలుషితమై పోయింది. పరిశ్రమలు గ్రీన్ బెల్టు ఏర్పాట్లు నిర్లక్ష్య ధోరణి స్పష్టంగానే కనిపిస్తుంది. అదేవిధంగా ఆయిల్ ఉత్పత్తి కర్మాగారాలు వరి పొట్టు ను వినియోగం చేయడం వల్ల ఆ పొట్టు గాలిలో కలుస్తూ ఉండడంవల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఏమాత్రం నల్లటి దువ్వ కంటిలో పడితే కళ్ళు కరకర అంటూ హాస్పిటల్ పాలవుతున్నారు.