Thursday, November 14, 2024

AP | వైద్యుల నిర్లక్ష్యం – పసి ప్రాణం బలి

  • ఊపిరి అందక నాలుగు నెలల చిన్నారి మృతి
  • మన్యంలో ఆగని శిశు మరణాలు
  • ఒక్క చదలవాడలోనే ముగ్గురు చిన్నారులు మృతి
  • అధికారులను తప్పుదోవ పట్టిస్తున్న వైద్యులు
  • పసి మరణాలను కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు


చింతూరు, నవంబర్ 6 (ఆంధ్రప్రభ ): వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైన‌ సంఘటన మండలంలో మంగళవారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం చదలవాడ గ్రామానికి చెందిన కలుముల దుర్గారావు – బుల్లెమ్మ గిరిజన దంపతుల నాలుగు నెలల చిన్నారి పాప ఈనెల 4వ తేదిన జ్వరం, ఆయాసంతో బాధపడుతుంటే చింతూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చామని తెలిపారు. సోమవారం రాత్రి 7గంటల సమయంలో ఆసుపత్రిలో జాయిన్‌ చేయగా వైద్యులు పరీక్షించి పాప బాగానే ఉందని చెప్పారని తెలిపారు. ఆసుపత్రిలో ఉండగా మంగళవారం మధ్యాహ్నాం పాప పరిస్థితి విషమంగా మారిందని వైద్యులను అడగగా ఏమి కాదు.. బాగానే ఉందని చెప్పారని తెలిపారు. 2 గంటల తరువాత పాప ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ఊపిరి అందక మృతి చెందిందని వారు ఆవేదన చెందారు.


పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్తామన్నా….
మా పాపను మెరుగైన వైద్యం కోసం భద్రాచలం తీసుకెళ్తామని చెప్పినా వైద్యులు అవసరం లేదని వాదించారని వాపోయారు. తీరా చూస్తే పాపం ప్రాణం బలిగొన్నారని గోడును వెల్లబుచ్చుకున్నారు. పాప పరిస్థితి బాగలేదని పలుమార్లు వైద్యులకు చెప్పి, పట్టణంలోని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్తామని ఎంత మొర పెట్టుకున్నా మాపై దురుసుగా ప్రవర్తించారని, తీరా చూస్తే పాప ప్రాణాలను విడిచిందని కన్నీటి పర్యంతమ‌య్యారు.


ఒక్క చదలవాడలోనే ముగ్గురు మృతి…
చింతూరు మన్యంలో వైద్యుల నిర్లక్ష్యమో, అధికారుల అలసత్వమో వెరసి మన్యంలో శిశు మరణాలు మాత్రం ఆగడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. చింతూరు మండలంలోని ఒక్క చదలవాడ గ్రామంలోనే ఈ మూడు నెలల వ్యవధిలో మడివి రాంబాబు – జయమ్మ, సాందల దేవి రెడ్డి – భద్రమ్మ తాజాగా కలుముల దుర్గారావు – చెల్లమ్మ గిరిజన దంపతుల ముగ్గురు చిన్నారులు మృతిచెందారు.

- Advertisement -


ఐటీడీఏ ముందు నిరసన…
వైద్యుల నిర్లక్ష్యంతో పాప మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పాప మృతదేహాంతో చింతూరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఐటీడీఏ పీవో ఆపూర్వ భరత్‌ తక్షణమే వారి వద్దకు వచ్చి నేనే మీ ఇంటికి వచ్చి ఏమి జరిగిందో తెలుసుకుంటానని చెప్పి ఆయన వాహనాన్ని ఇచ్చి వారి గ్రామానికి వారిని పంపించారు. గిరిజన దంపతులకు తక్షణ సాయం కింద రూ.10 వేలు ఇవ్వాలని ఆదేశించారు.


అధికారులను తప్పుదోవ పట్టిస్తున్న వైద్యులు…
చింతూరు మన్యంలో జరుగుతున్న శిశు మరణాల విషయంలో ఐటీడీఏ పీవోతో సహా ఉన్నతాధికారులను సైతం తప్పుదోవ పట్టిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఏజెన్సీలో ఏ చిన్నారి మృతిచెందినా ఆ మృతికి పసర మందు, నాటు వైద్యం వల్ల‌నే మృతి చెందినట్లు వైద్యులు నివేదికలు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్య ఇంకొక అడుగు ముందుకు వేసి వైద్యులు సరికొత్త కారణాన్ని వెలుగులోకి తీసుకొస్తున్నారు. వైద్యులు చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు శిశువుల మృతిని తల్లిపై నెట్టే దౌర్భాగ్య స్థితికి ఒడిగడుతున్నారు. తల్లికి చిన్నారులకు పాలు పట్టించడం రావడం లేదని, పాలు పట్టించిన తరువాత పిల్లల వీపు మీద చిన్న చిన్న దెబ్బలు కొట్టాలని అలా చేయకపోవడం వలన తల్లి పట్టించిన పాలు ఊపిరితిత్తులకు చేరి మృతి చెందుతున్నారని నివేదికలు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ఆసుపత్రిలో జరిగిన ఘటనలు బయటకు రాకుండా పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆసుపత్రిలో శిశువులు మృతి చెందితే ఆశా వర్కర్లకు విషయం బయటకు పొక్కనీయవద్దని హుకుం జారీ చేస్తున్నారు. ఇదే క్రమంలో బాధిత కుటుంబానికి శిశు మృతదేహాన్ని తరలించేందుకు వాహన రవాణా ఖర్చులు సైతం ఇచ్చి గుట్టుచప్పుడు కాకుండా ఇళ్లకు పంపిస్తున్నారనే ఆరోపణలున్నాయి.


ఐటీడీఏ పీవో ఏమన్నారంటే…
చింతూరు ఐటీడీఏ పరిధిలో జరుగుతున్న శిశు మరణాలపై ఐటీడీఏ పీవో అపూర్వ భరత్ స్పందిస్తూ.. పూర్తిస్థాయి విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. మన్యంలో ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల వారిగా చిన్న పిల్లల వివరాలు సేకరించి వారి ఆరోగ్య స్థితిగతులను పరీక్షించి తగు చర్యలు చేపడతామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement