న్యూ ఢిల్లీ – నీట్ పేపర్ లీక్ అయ్యిందనేది స్పష్టమైందని, అయినప్పటికీ తిరిగి పరీక్ష నిర్వహించడం అనేది చివరి ఆప్షన్‌గానే ఉండాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. నీట్ పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలన్న పిటిషన్లపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
నీట్ పేపర్ లీక్ అయ్యిందనేది స్పష్టమైంది. ఇది ఒప్పుకోవాల్సిన విషయం. కానీ, ఇక్కడ ప్రశ్న ఏంటంటే.. ఎంత మందికి చేరింది?. ఎంత మంది ఆ లీకేజీతో లాభపడ్డారు?. ఇప్పటివరకు ఎంత మందిని గుర్తించారు?. పేపర్ లీక్‌తో ఇంకా లాభపడ్డవాళ్లు ఎవరైనా ఉన్నారా?. ఈ కేసులో ఇంకా తప్పు చేసిన వాళ్లను గుర్తించాల్సి ఉందా?.. పేపర్ లీక్‌తో లాభపడిన విద్యార్థుల్ని ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఎంత ఫలితాల్ని హోల్డ్‌లో పెట్టారు?. వీటన్నింటిపై సమగ్ర దర్యాప్తు జరగాలని, నివేదిక తమకు సమర్పించాలని కేంద్రాన్ని, ఎన్టీఏని ఆదేశించింది. అలాగే పేపర్ లీక్‌కు సంబంధించిన లోపాలను పసిగట్టేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది? అని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు.
డాక్టర్లు, ఇంజినీరింగ్‌లు కావాలన్న మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన అంశంపై మేం వాదనలు వింటున్నాం. ఇది 23లక్షల మందితో జీవితాలతో ముడిపడిన అంశం ఇది. అందుకే నీట్ పరీక్ష పవిత్రతను దెబ్బతీశారని రుజువైనా , నేరం చేసిన వారిని గుర్తించలేకపోయినా మేం నీట్ రీ-టెస్ట్‌కు ఆదేశిస్తాం. లీకైన ప్రశ్నపత్రం సోషల్‌మీడియాలో వ్యాప్తి చేశారని తెలిసినా మళ్లీ పరీక్ష నిర్వహించాలని చెబుతాం. కానీ, రీ-టెస్ట్‌కు ఆదేశించే ముందు.. లీకైన పేపర్ ఎంతమందికి చేరిందో తేలాల్సి ఉంది” అని ధర్మాసనం తెలిపింది. ఈ తరుణంలో విచారణను గురువారానికి వాయిదా వేస్తూ ఆరోజు పిటిషనర్ల వాదనలు వింటామని సుప్రీం ధర్మాసనం చెప్పింది.
వాదనల సందర్భంగా.. ముందుగా కేంద్రం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి కొన్ని వివరాలను సీజేఐ బెంచ్ ఆరా తీసింది..
నీట్ పేపర్ సెట్ చేసిన తర్వాత ప్రింటింగ్ ప్రెస్ కు ఎలా పంపించారు ?: సీజేఐ
ప్రింటింగ్ ప్రెస్ నుంచి పరీక్షా కేంద్రానికి ఎలా పంపారు ?: సీజేఐ
ఏ తేదీలలో ఈ ప్రక్రియ జరిగింది ?: సీజేఐ
దీనికి అడిషనల్ సోలిసిటర్ జనరల్ సమాధానమిస్తూ.. ఒకే సెంటర్ లో పేపర్ లీక్ అయ్యిందన్నారు.
అంటే నీట్ పేపర్ లీక్ అయ్యిందనేది స్పష్టం అయ్యింది: సీజేఐ
ఈ అంశంపై జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది: సీజేఐ
23 లక్షల మంది భవిష్యత్తును పరిరక్షించాల్సిందే: సీజేఐ
పరీక్ష మళ్లీ ఎందుకు నిర్వహించకూడదు?: సీజేఐ
అక్రమార్కులను గుర్తించకపోతే తిరిగి పరీక్ష నిర్వహించడం మినహా మరేదైనా మార్గం ఉందా ?: సీజేఐ
పేపర్ లీక్ పై ఆరు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి : పిటిషనర్లు
ఒకే సెంటర్ లో పేపర్ లీక్ అయ్యింది : ప్రభుత్వం
పరీక్షకు మూడు గంటల ముందు పేపర్ లీక్ అయ్యింది: ఎన్ టి ఎ