అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న ఫ్యాన్సీ నంబర్ల మోజును దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక నంబర్లు దక్కించుకునేందుకు రవాణాశాఖ ఫీజులను ఖరారు చేసింది. నిర్థేశిత రుసుము చెల్లించిన వారు మాత్రమే ఫ్యాన్సీ నంబర్లు దక్కించుకునేందుకు ఈ-ఆక్షన్‌లో పాల్గొనే అవకాశం ఉంటుందని రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. వాహన నంబర్లను ఎనిమిది కేటగిరిటీలుగా విభజించి నంబర్లకు రేట్లను ఫిక్స్ చేశారు. గతంలో 9999 నంబరు దక్కించుకోవాలంటే ముందుగా రూ.50వేల ఫీజు చెల్లించాల్సి ఉంది. ఆ తర్వాత నిర్వహించే ఈ-వేలంలో అత్యధిక రేటు పెట్టిన వాహనదారుకు ఆ నంబరు కేటాయించేవారు. ఇప్పుడు దానిని రూ. ఏకంగా రూ.2లక్షలు చేశారు. వాహన నంబరు 1, 9, 999 పొందాలంటే రూ.లక్ష, 99, 3333, 4444, 5555, 6666, 7777 నంబర్లకు రూ.50వేలు, 5,6,7,333,369, 555, 666, 777, 1111,1116,1234, 2277, 2345, 2727, 3339, 3366, 3456, 3699, 3939, 4455, 4545, 4599, 6669, 6789,8055, 8888 నంబర్లకు రూ.30వేలు, 3, 111, 123,234, 567, 1188, 1818, 1899, 1999, 2222, 2799, 3636, 3999, 5678, 5999, 6999, 7999, 9009 నంబర్లకు రూ.20వేలు, 11, 39, 55, 456, 459, 1112, 1212, 1989, 2259, 2525, 3335, 3969, 4512, 4777, 5445, 5559, 5589, 5599, 5666, 5859, 6786, 6969, 7779, 7979, 8889 నంబర్లకు రూ.15వేల ఫీజుగా చెల్లించాలి.
మిగిలిన నంబర్లలో కొన్నింటికి రూ.10వేలు, రూ.5వేలుగా నిర్ణయిస్తూ రవాణాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.5వేల నంబర్ల కేటగిరీలో ద్విచక్ర వాహనాలకు రూ.2వేలు నంబర్ రిజర్వేషన్ చార్జీగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి రోజు మధ్యాహ్నం 1గంట వరకు ప్రత్యేక నంబర్ల కోసం ఆన్‌లైన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 2గంటల నుంచి 4గంటల మధ్య మధ్యాహ్నం వరకు వచ్చిన దరఖాస్తుదారులకు ఈ-వేలం నిర్వహించి అత్యధిక మొత్తం పాడుకున్న వారికి కేటాయిస్తారు. నిర్థేశిత ఫీజు చెల్లించి ఈ-వేలంలో పాల్గొనని వారు చెల్లించిన మొత్తాన్ని రవాణాశాఖ జప్తు చేస్తుంది. ఒకవేళ ఏ ఒక్కరూ ప్రత్యేక నంబర్ల కోసం దరఖాస్తు చేసుకోని పక్షంలో రవాణాశాఖ రోజువారీ కేటాయింపుల్లో భాగంగానే ఆయా నంబర్లను వాహనాలకు కేటాయిస్తుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.