తిరుపతి సిటీ, తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈనెల 26వ తేదీ నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు అక్టోబరు 5వ తేదీ దాకా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. నవరాత్రి ఉత్సవాలు జరిగే రోజుల్లో భక్తులు ఇబ్బందిపడకుండా అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఇక.. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు జరుగనున్నాయి. రోజూ ఆలయంలోని కృష్ణస్వామి ముఖ మండపంలో పద్మావతి అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, పండ్ల రసాలతో అభిషేకం చేస్తారు. సాయంత్రం ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. అక్టోబరు 5వ తేదీ విజయదశమి రోజున పద్మావతి అమ్మవారు విశేషమైన గజ వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో 10 రోజుల పాటు కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేస్తున్నట్టు టీటీడీ తెలిపింది. అదేవిధంగా సెప్టెంబరు 30న లక్ష్మీపూజ, అక్టోబరు 5న అష్టోత్తర శత కలశాభిషేకం సేవలను కూడా రద్దు చేశారు.