విశాఖపట్నం, ఆంధ్రప్రభబ్యూరో: భారత్‌కు చిరకాల ప్రత్యర్ధిగా నిలిచిన పాకిస్థాన్‌పై 1971లో చిరస్మరణీయమైన విజయం సాధించింది. అప్పటి నుంచి ఆ విజయానికి గుర్తుగా తూర్పు నావికాదళం ప్రతీ ఏటా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అంతేకాకుండా భారత్ సత్తాను ప్రపంచ దేశాలకు తెలియజేసేందుకు వీలుగా అనేక విన్యాసాలను నిర్వహిస్తూ ఉంటుంది. ప్రస్తుతం భారత్ నావికాదళం చేతిలో అనేక అత్యాధునిక యుద్ధ నౌకలతో పాటు క్షణాల్లో శత్రు శిభిరాలను విచ్చిన్నం చేసే అనేక విమానాలు, ఇతర హెలికాప్టర్లు, బాంబు విస్పోటనాలు ఇలా ఎన్నో కలిగి ఉంది.
ఈ నేపధ్యంలోనే తూర్పు నావికాదళం విశాఖ సాగరతీరం వేదికగా ఇప్పటికే అనేక కార్యక్రమాలను నిర్వహించి శత్రు దేశాలకు సవాల్‌గా నిలిచింది. అందులో భాగంగానే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్), కొద్ది రోజుల క్రితం మిలాన్, ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూలు ఇక్కడ సాగర తీరంలోనే సమర్ధవంతంగా పూర్తి చేసింది. ఇందులో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూకు అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరయ్యారు.
నేడే నేవీ డే:-
ప్రతీ ఏటా డిసెంబర్ 4న క్రమం తప్పకుండా తూర్పు నావికాద ళం నేవీ డేను నిర్వహిస్తూ వస్తుంది. కోవిడ్ తరువాత పూర్తి స్థాయిలో ఈ సారి నేవీడే నిర్వహణకు ఇప్పటికే నావికాదళం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఏడాది భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. ఇక రక్షణశాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ఇతర ప్రముఖులు పాల్గొంటారు. ఆదివారం సాయంత్రం ఈ నావికాదళ విన్యాసాలు ఆర్.కె.బీచ్‌లో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శత్రువులపై నిరంతరం పోరాటం సాగించే వీరోచిత విన్యాసాలను అతిధులు సమక్షంలో ప్రదర్శిస్తారు.
ఇప్పటికే గత వారం రోజులుగా రిహార్స్‌ల్స్ పూర్తి చేశారు. సాయంత్రం జాతీయ గీతంతో నావికాదళం విన్యాసాలు ప్రారంభం కానున్నాయి. అనంతరం సముద్రంలో నుంచి సైనికులు ఒడ్డుకు చేరుకొని శత్రువులను తుద ముట్టించే అంశాలు, నడిస ముద్రంలో బాంబుల విస్పోటనం, క్షణాల్లో శత్రు దేశాలపై బాంబులు వేసి విచ్చిన్నం చేసే విమానాల ప్రదర్శన , మిగ్ విమానాలు, చేతక్ హెలీకాప్టర్లు, పారాచుట్‌తో సైనికులు చేసే విన్యాసాలు సముద్రంలో హెలికాప్టర్ల నుంచి కిందకు దిగి తిరిగి పైకి చేరుకునే విన్యాసాలు, ఒకేసారి అతిపెద్ద నౌకలపై హెలికాప్టర్ల ల్యాండింగ్ ఇలా ఎన్నో విన్యాసాలు చేయనున్నారు. ఒళ్లు గుగుర్పాటు చేసే ఈ విన్యాసాలు అత్యంత సాహసోపేతమైనవి.
సాగరతీరంలో వీటిని తిలకించేందుకు సుమారు 2500 మందికి పైగా ప్రముఖులు హాజరు కానున్నారు. రాష్ట్ర , జిల్లాల ప్రముఖులు దేశ విదేశాల నుంచి హాజరయ్యే అతిధులు , నగర ప్రజలు వీటిని తిలకించేందుకు రానున్నారు. వీరందరికి అవసరమయ్యే విధంగా నావికాదళం అధికారులు, జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది.
రాష్ట్రపతి పర్యటన వివరాలు
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ఉదయం 10.20 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ ప్రముఖల నుంచి స్వాగతాలు స్వీకరించిన అనంతరం 11.05 గంటలకు బయలుదేరి 11.25కు ముర్లీ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుంటారు. అక్కడ పౌరసన్మానం కార్యక్రమంలో పాల్గొంటారు. తదుపరి 12.30కు విజయవాడలో రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. రెండు గంటల వరకు అక్కడే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 2 నుంచి 2.15 వరకు గవర్నర్ ను ప్రముఖలంతా సత్కరించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి మెమోంటోను బహుకరిస్తారు. 2.40కి గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 3.45కు విశాఖ విమానాశ్రయంలో ఐఎన్‌ఎస్ డేగాకు చేరుకుంటారు.
సాయంత్రం 4 నుంచి 4.20 వరకు ఐఎన్‌ఎస్ డేగాలో విశ్రాంతి తీసుకుంటారు. తదుపరి 4.20కు అక్కడ నుంచి బయలుదేరి 4.35కు ఆర్.కె.బీచ్‌కు చేరుకుంటారు. 4.40 నుంచి 6.20 వరకు నావికాదళ విన్యాసాలు తిలకించి అనంతరం నావికాదళానికి సంబంధించిన పుస్తకం ఆవిష్కరణ గావిస్తారు. ఈ సందర్భంగా పలువురు సైనికులకు రాష్ట్రపతి మెడల్స్ బహుకరిస్తారు. సాయంత్రం 6.20కు బయలుదేరి 6.40కు విశాఖ విమానాశ్రయంలో ఐఎన్‌ఎస్ డేగాకు చేరుకుంటారు. 6.40 నుంచి 7.20 వరకు నేవీ రిసప్షన్‌లో పాల్గొంటారు. 8.20కు విశాఖ నుంచి బయలుదేరి 9.20కు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. 9.30కు రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి 9.50కు రాజ్‌భవన్‌కు చేరుకుంటారు.