Tuesday, November 26, 2024

నాటుసారా, జె బ్రాండ్స్ పై ఉద్యమం.. పార్టీ క్యాడర్‌కు చంద్రబాబు పిలుపు

అమరావతి, ఆంధ్రప్రభ ; నాటుసారా, జె బ్రాండ్స్‌ విక్రయాలపై ఉద్యమించాలని, రాష్ట్రంలో కల్తీసారా ఎరులై పారుతున్నా.. అరికట్టని ప్రభుత్వాన్ని నిలదీయాలని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. శని, ఆదివారాల్లో రెండ్రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ క్యాడర్‌కు సూచించారు. శనివారం నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్న నేపథ్యంలో శుక్రవారం చంద్రబాబు పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ధనదాహంతో మహిళల తాళిబొట్లు తెంచుతున్నారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వస్తే మద్య నిషేధం విధిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు కల్తీసారా, నాణ్యత లేని సొంత బ్రాండ్లతో పేదల ప్రాణాలు బలిగొంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నాటుసారా, కల్తీసారా ఏరులై పారుతున్నా.. ప్రభుత్వం అరికట్టేందుకు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. జె బ్రాండ్లు స్లో పాయిజన్‌ అని కేవలం కమీషన్ల కోసమే నాణ్యత లేని మద్యం విక్రయాలు సాగిస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారని ఆరోపించారు.

కల్తీ మద్యం వల్ల ప్రాణాలు వెంటనే పోతుంటే జె బ్రాండ్లు స్లో పాయిజన్‌లా ప్రాణాలు తీస్తున్నాయని అన్నారు. దేశంలో ఎక్కడా లేని బ్రాండ్లు రాష్ట్రంలో ఎందుకు ఉన్నాయని, వీటిని ఎవరు తయారు చేస్తున్నారో, ఎంతకు విక్రయిస్తున్నారో అనే అంశాలపై ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. రూ. 60 ఉండే మద్యం బాటిల్‌ రేటుని రూ. 120 నుంచి రూ. 150కి పెంచి ప్రజలను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. సొంత బ్రాండ్ల ద్వారా ఏడాదికి ప్రజల నుంచి రూ. 5 వేల కోట్లు కాజేస్తున్నారని ఐదేళ్లలో మద్యం కమీషన్ల రూపంలో రూ. 25 వేల కోట్ల నుంచి రూ. 30 వేల కోట్ల వరకు ఆర్జిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. జంగారెడ్డిగూడెంలో కల్తీసారా వల్ల 27 మంది మరణిస్తే వాటిని సహజ మరణాలుగా చూపుతున్నారని అన్నారు. మద్యం అధిక ధరలకు విక్రయించడం వల్లే ప్రజలు నాటుసారా వేపు వెళ్తున్నారని, దీంతో ప్రాణాలు పోతున్నాయని బాధితులు చెప్పిన ఈ అంశాలన్నింటినీ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని పార్టీ కేడర్‌కు సూచించారు.

ముఖ్యమంత్రి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అవి ఏస్థాయిలో ఉన్నాయో ఇప్పుడు ఆధారాలతో సహా బయటపడుతున్నాయని పేర్కొన్నారు. పోలీస్‌ శాఖలో ఒకే సామాజిక వర్గాని కి చెందిన 37 మందికి డీఎస్పీగా ప్రమోషన్లు ఇచ్చారని వైకాపా చేసిన ప్రచారం తప్పుడు ప్రచారంగా తేలిందన్నారు. మరోవైపు పెగాసెస్‌ టీడీపీ హయాంలో కొనలేదన్న అంశం కూడా ఆధారాలతో సహా తేలిందన్నారు. ప్రతి అంశంపై అసత్య ప్రచారాలు చేస్తున్న వైకాపా ప్రభుత్వాన్ని నిలదీయాలని చంద్రబాబు సూచించారు. రెండ్రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా మద్యంపై ఉద్యమించి ప్రజలకు వాస్తవాలు తెలపాలని కేడర్‌కు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను నిర్వహించి జయప్రదం చేయాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement