తిరుచానూరులో ఇంటింటికి పైపులైన్ ద్వారా గ్యాస్ పంపిణీ పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. పలువురు న్యాచురల్ గ్యాస్ లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. అనంతరం ఓ వినియోగదారుని ఇంట్లో చంద్రబాబు స్టవ్ వెలిగించి టీ తయారు చేశారు. పైప్‌లైన్ గ్యాస్, సిలిండర్ గ్యాస్ మధ్య వ్యత్యాసం గురించి వినియోగదారుడిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ… 2047 స్వర్ణాంధ్ర లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. గతంలో గ్యాస్ ఉచితంగా అందంచిన ఘనత టీడీపీదే అని అన్నారు. ‘‘నాడు దీపం 1 ద్వారా ఇంటింటికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చాం. నేడు దీపం 2 ద్వారా ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తున్నాం. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి.. 24 గంటలు గ్యాస్ సరఫరా చేసేందుకు నేరుగా పైపులైన్ ద్వారా న్యాచురల్ గ్యాస్ సరఫరా ప్రారంభించాం’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నామని… ప్రతి ఇంటికి గ్యాస్ సరఫరా చేసేందుకు ఐదు కంపెనీలను సంప్రదించామని సీఎం చంద్రబాబు తెలిపారు.
పైపులైన్ ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన గ్యాస్ అందిస్తామన్నారు. ఇంటింటికి గ్యాస్ సరఫరాకు 2014-19 మధ్య ప్రణాళికలు రూపొందించామన్నారు. దాదాపు 99 లక్షల కుటుంబాలకు గ్యాస్ సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్ త్వరలోనే గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మారనుందని పేర్కొన్నారు. మన రాష్ట్రంలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. గోదావరి బేసిన్‌లో 40 శాతం గ్యాస్ అందుబాటులో ఉందన్నారు. గ్రీన్ ఎనర్జీ వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయని.. భవిష్యత్తులో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, ఎగుమతులు కూడా చేస్తామన్నారు.