శ్రీహరికోట – జీఎస్ఎల్వీ ఎఫ్ 14 ప్రయోగం విజయవంతమైంది… దిగ్విజయంగా భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీహరికోట నుంచి ఇవాళ సాయంత్రం 5.35 గంటలకు ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.. 2,275 కిలోల బరువు గల ఇన్సాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని 19 నిమిషాలలోనే ఈ వాహననౌక నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహాన్ని వాతావరణ పరిశీలనలను మెరుగుపరచడానికి, భూమి, సముద్ర ఉపరితలాలను పర్యవేక్షించడానికి రూపొందించారు. తద్వారా వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరుస్తుంది. ప్రస్తుతం కక్ష్యలోని ఇన్సాట్-3డీ, ఇన్సాట్-3డీఆర్ ఉపగ్రహాలతో కలిసి ఇది పనిచేయనుంది.
కాగా, జీఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది 16వ ప్రయోగం. పూర్తి స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్ తో ఈ రాకెట్ ను రూపొందించారు. భారత్ బరువైన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించేటప్పుడు జీఎస్ఎల్వి రాకెట్లు అవసరమయ్యాయి. ఈ తరహా ప్రయోగాలకు ఎన్నో అవరోధాలు ఏర్పడినప్పటికీ ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ జీఎస్ఎల్వి రాకెట్లను ఇస్రో పూర్తి స్థాయిలో నిర్మిస్తోంది. ఈ ప్రయోగం కూడా విజయవంతం కావడంతో ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్ లో పాల్గొన్న శాస్ర్తవేత్తలను, సిబ్బందిని ఆయన అభినందించారు..