కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ చేతులమీదుగా
అవార్డు అందుకున్న ఎన్టీఆర్ జిల్లా పూర్వ కలెక్టర్ ఎస్.డిల్లీరావు
ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక అమల్లో జిల్లాను అత్యున్నత స్థానంలో నిలబెట్టినందుకు దక్కిన గౌరవం
నేటి బాలలే భావి భారత సారథులు… అలాంటి బాలల హక్కుల సంరక్షణలో గత రెండేళ్లలో విశేష కృషి చేసి ఎన్‌టీఆర్ జిల్లాను అత్యుత్తమ ప్రగతి సాధించిన జిల్లాగా నిలిపినందుకు అప్పటి కలెక్టర్ ఎస్.డిల్లీరావుకు జాతీయస్థాయి పురస్కారం లభించింది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్‌సీపీసీఆర్), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ చేతులమీదుగా డిల్లీరావు అవార్డు అందుకున్నారు. రేపటి పౌరులైన బాలల భవితవ్యానికి హక్కుల సంరక్షణతో బంగారు బాటలు వేయడంలో చిత్తశుద్ధితో చేసిన కృషి భేష్ అంటూ ప్రశంసలు అందుకున్నారు.
నిత్య నూతనంగా, వినూత్నంగా…
మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాను అడ్డుకోవడంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తూ, చిన్నారులు చెడు అలవాట్లవైపు మళ్లకుండా వినూత్న కార్యక్రమాలు అమలుచేయడంలో ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్‌గా గత రెండేళ్లలో డిల్లీరావు విశేష కృషిచేశారు. ఎన్‌సీపీసీఆర్, ఎన్‌సీబీల ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక (జేఏపీ) అమల్లోనూ తనదైన ముద్ర వేశారు. ఎప్పటికప్పుడు వినూత్నంగా ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్లి.. మెరుగైన ఫలితాలు సాధించారు. పోలీస్, ఐసీడీఎస్ వంటి సమన్వయ శాఖలు.. చైల్డ్‌లైన్, ఫోరం ఫర్ ఛైల్డ్ రైట్స్, నవజీవన్ బాలభవన్, సంయుక్త ఫౌండేషన్‌లు వంటి స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థల సమష్టి భాగస్వామ్యంతో మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపారు.
చిన్నారులు చెడుదోవ పడితే అది దేశ భవితకు పెను విపత్తు అని గుర్తించి..చిన్నారులు మత్తుపదార్థాలు, మాదకద్రవ్యాలు ఉచ్చులో చిక్కుకోకుండా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్పరిణామాలపై చైతన్య కార్యక్రమాలను ముందుండి నడిపించారు. అంతేకాదు.. లైంగిక వేధింపులపై అవగాహన కల్పిస్తూ.. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు పాటుపడుతూ బాల్య వివాహాలను అరికట్టడంలో సఫలీకృతులయ్యారు. మాదకద్రవ్యాల వినియోగంతో ఎదురయ్యే సమస్యలపై ప్రత్యేకంగా లఘు చిత్రాలను రూపొందించడం, వీధి నాటికలు, ర్యాలీలు, వైద్య శిబిరాలతో పాటు విస్తృత స్థాయిలో గోడ పత్రికలు, కరపత్రికలను రూపొందించి పాఠశాలలు, కళాశాలలతో పాటు సమాజంలోని వివిధ వర్గాలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయదారులకు కళ్లెం వేసేందుకు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లూ సత్ఫలితాలిచ్చాయి. మాదకద్రవ్యాల వినియోగం పరంగా గుర్తించిన హై రిస్క్ ప్రాంతాలపై డేగ కన్ను పెట్టి, మాదకద్రవ్యాలకు అలవాటుపడిన వారిని డీ అడిక్షన్ కేంద్రానికి పంపి కౌన్సెలింగ్ నిర్వహించడంతో పాటు మాదకద్రవ్యాల అలవాటును విడనాడేలా చేయడంలోనూ చేసిన కృషికి డిల్లీరావుకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ జాతీయ స్థాయి గుర్తింపు సాధించడంలో సహాయ సహకారాలు, భాగస్వామ్యం అందించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు జిల్లా పూర్వ కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.