కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన ఇంకా కొనసాగుతూనే ఉంది. అందులో భాగంగా రైతు సంఘాలు పిలుపునిచ్చిన ఇవాళ భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 12 గంటల పాటు ఈ బంద్ కొనసాగుతుందని సంయుక్త కిసాన్ మోర్చా నేతలు పేర్కొన్నారు. రైలు, రోడ్డు రవాణా సర్వీసులను నిలిపివేయాలని రైతు నేతలు నిర్ణయించారు. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో రైలు, రోడ్డు రవాణా సర్వీసులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, మార్కెట్లు, షాపింగ్ మాల్స్ సైతం మూసివేయాలని రైతులు నాయకులు పిలుపునిచ్చారు. బంద్‌ను శాంతియుతంగా నిర్వహించి తమకు మద్దతుగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంబులెన్స్, అత్యవసర సేవలు మినహా అన్నింటినీ అడ్డుకుంటామని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త సాగు చట్టాల ఉపసంహరణకు రైతు సంఘాలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉక్కు కార్మిక సంఘాలు కూడా భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం బంద్‌కు మద్దతు ఇస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రారంభమయింది. నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా మధ్యాహ్నం 1 గంట వరకు ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. అనంతరం యథావిధిగా తిరగనున్నాయి. కార్మిక సంఘాలు, లారీ, గూడ్స్ వాహనాల యజమానులు కూడా బంద్‌కు అనుకూలంగా ప్రకటన ఇవ్వడంతో సరకు రవాణా నిలిచిపోనుంది. రైళ్ల రాకపోకలు యథావిధిగా ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు పనిచేయనున్నాయి. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు శుక్రవారం సెలవు ప్రకటించాయి. విద్యార్థులు ఇళ్లకే పరిమితం కానున్నారు. విశాఖ నగరంలోని మద్దిలపాలెం జంక్షన్ దగ్గర వామపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయ రాష్ట్రంలోని పలు చోట్ల వామపక్షాలు ఆందోళన చేస్తున్నాయి.