Tuesday, September 17, 2024

Narsipatnam – క‌లుషిత ఆహారం తిని న‌లుగురు విద్యార్థుల మృతి

మ‌రో 27 మంది స్టూడెంట్స్‌కి అస్వ‌స్థ‌త‌
హోమ్ మంత్రి అనిత‌ దిగ్భ్రాంతి
అన‌కాప‌ల్లి ఏరియా ఆస్ప‌త్రిలో చికిత్స‌

నర్సీపట్నం… ఆంధ్ర ప్రభ న్యూస్ : అన‌కాప‌ల్లి జిల్లా కోట‌వుర‌ట్ల మండ‌లం కైలాస‌ప‌ట్నం లోని ఒక ప్రైవేటు ఆర్గ‌నైజేష‌న్ నిర్వ‌హిస్తున్న అనాథ‌ ఆశ్ర‌మంలో క‌లుషిత ఆహారం తిని న‌లుగురు విద్యార్థ‌లు మృతి చెంద‌గా మ‌రో 27 మంది అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దీంతో జిల్లాల్లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. ఈ అనాథాశ్ర‌మంలో జిల్లాలోని ప‌లు ప్రాంతాల‌కు చెందిన విద్యార్థులు ఇక్క‌డ ఉంటూ చ‌దువుకుంటున్నారు.

- Advertisement -

ఫుడ్ పాయిజ‌న్‌…
అనాథాశ్ర‌మంలో ఆదివారం మ‌ధ్యాహ్నం ఫుడ్‌తోపాటు స‌మోసాల‌ను పిల్ల‌లు తిన్నారు. సాయంత్రం పిల్ల‌లంద‌రూ వాంతులు అయ్యాయి. దీంతో నిర్వ‌హ‌కులు భ‌య‌ప‌డి వారివారి ఇళ్ల‌కు పిల్ల‌ల‌ను పంపించేశారు. ఇంటికి చేరిన న‌లుగురు విద్యార్థులు మృతి చెందారు. మృతి చెందిన విద్యార్థులను జాషువా, భవాని, శ్రద్ధగా గుర్తించారు. మిగతా 27 మందికి నర్సీపట్నం, అనకాపల్లి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ఏడుగురు, అనకాపల్లి ఏరియా ఆసుపత్రిలో 20 మంది విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై డీఈవో అప్పారావు విచారణ చేపట్టారు.

ఇతర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులను వారి తల్లిదండ్రులు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. నర్సీపట్నంలో 16 మందని ప్రాథమిక చికిత్స అందించి అందులో 12 మంది చిన్నారులను మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖ కేజిహెచ్ ఆసుపత్రికి తరలించారు. డౌన్ఊరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొంత మంది విద్యార్థులు, పాడేరు ఆసుపత్రిలో కొంత మంది చికిత్స పొందుతున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న తర్వాత అధికారులు అప్రమత్తమయ్యారు. నర్సీపట్నం ఆర్డిఓ జయరాం, డి.ఎస్.పి మోహన్ ఆసుపత్రికి వచ్చి పరిస్థితి సమీక్షించారు. అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ జాహ్నవి ఏరియా ఆసుపత్రి చేరుకొని చిన్నారులు పరిస్థితి ఆరా తీశారు. జరిగిన ఘటనపై అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మెరుగైన చికిత్సను అందించాలని వైద్యులకు సూచించారు.

హోమ్ మంత్రి అనిత‌ దిగ్భ్రాంతి
కోటవురట్ల మండలం కైలాసపట్నం పరిశుధ్ధాత్మ అగ్నిస్తుతి ఆరాధన ట్రస్ట్ అనాథాశ్రమంలో పుడ్ పాయిజన్ పై హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. క‌లుషిత ఆహారం తిని విద్యార్థుల మృతి ప‌ట్ల ఆమె దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. అలాగే కేజీహెచ్‌, న‌ర్సీప‌ట్నం ఆస్ప‌త్రుల సూప‌రింటెండెంట్ల‌తో ఆమె ఫోన్‌లో మాట్లాడి విద్యార్థుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్య ప‌రిస్థితి పై ఆరా తీశారు.

చంద్ర‌బాబు దిగ్భాంతి..

అనాథాశ్రమంలో కలుషిత ఆహారంతో నలుగురు విద్యార్థుల మృతిచెందడంపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అస్వస్థతకు గురైన ఇతర విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అవ‌స‌ర‌మైతే అన్ని సౌక‌ర్యాలున్న హాస్ప‌ట‌ల్స్ కు వారిని త‌ర‌లించాల‌ని కోరారు..అలాగే చ‌నిపోయిన విద్యార్ధుల కుటుంబాలు ప్ర‌భుత్వ‌ప‌రంగా న‌ష్ట ప‌రిహ‌రం చెల్లిస్తామ‌ని ప్ర‌క‌టించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement