నర్సీంపట్నం వైద్యుడు డాక్టర్ సుధాకర్ (52) గుండెపోటుతో నిన్న మృతి చెందారు. గతేడాది కరోనా రోగులకు సేవలు అందించిన మత్తు వైద్య నిపుణుడు డాక్టర్ సుధాకర్.. ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవని, ప్రభుత్వాధికారులు ఎవరూ తమకు సహకరించడం లేదని తీవ్ర విమర్శలు చేశారు. ఆసుపత్రిలో గ్లౌజ్‌లు, మాస్కులు ఇవ్వలేదని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు దిగుతూ మీడియాలో హల్ చల్ చేశారు. దీంతో ప్రభుత్వం సుధాకర్ ను విధుల నుంచి సస్పెండ్ చేసింది.
నడిరోడ్డుపై పోలీసులు ఆయనను చిత్రహింసలకు గురిచేసిన వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. సుధాకర్ మానసిక స్థితి బాగాలేదంటూ విశాఖపట్టణంలోని మానసిక ఆసుపత్రిలో చికిత్స అందించారు. దీంతో సుధాకర్ కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. మస్కులు అడిగినందుకు డా.సుధాకర్ ను పిచ్చివాడిగా ముద్ర వేస్తోందని కుటుంబీకులు ఆరోపించారు. అయితే, కోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది. త్వరలోనే ఈ కేసులో తీర్పు రావాల్సి ఉండగా అంతలోనే ఆయన మరణించారు. కాగా, సుధాకర్‌ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకోలేదు. దీంతో ఆయన తీవ్ర మనోవేదనకు గురైనట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
మరోవైపు డాక్టర్ సుధాకర్ మృతి పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యాదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. డాక్టర్ సుధాకర్ గారి మృతి నన్ను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిందని అన్నారు. మాస్క్ అడగడమే దళిత వైద్యుడు చేసిన నేరంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో రెక్కలు విరిచి కట్టి, కొట్టి, నానా హింసలు పెట్టి పిచ్చాసుపత్రిలో చేర్పించడంతో సుధాకర్ బాగా కుంగిపోయారని పేర్కొన్నారు. ఒక సామాన్య వైద్యుడిని వెంటాడి వేధించి చివరికి ఇలా అంతమొందించారని ఆరోపించారు. ‘’ఇది గుండెపోటు కాదు. ప్రశ్నించినందుకు ప్రభుత్వం చేసిన హత్య ఇది. నిరంకుశ సర్కారుపై పోరాడిన సుధాకర్ గారికి నివాళి అర్పిస్తున్నాను. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.’’ అని తీవ్రంగా లోకేష్ ట్వీట్ చేశారు.