భారీ వర్షాలు, వరదల కారణంగా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో కొంత మంది గల్లంతై చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో తృటిలో ఓ భారీ ప్రమాదం తప్పడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం కలిగిస్తుండడంతో హిందూపురం కొట్నూరు చెరువు మరువ వద్ద పెను ప్రమాదం తృటిలో తప్పింది.
తూముకుంట గార్మెంట్స్ కు వెళ్లే ప్రైవేటు బస్సు నీటిలో చిక్కుకుపోయింది. చెరువు వద్ద నీటి ప్రవాహం భారీగా ఉన్నా… డ్రైవర్ రోడ్డు దాటే ప్రయత్నం చేశాడు. ఈ సమయంలో బస్సులో దాదాపు 30 మంది ప్రయాణీకులున్నారు. వరద ధాటికి బస్సు చిన్నగా జారుకుంటుండడంతో స్థానికుల సహాయంతో బస్సును ఆపగలిగారు. దీంతో బస్సులో ఉన్న మహిళా కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు. భారీ నీటి ప్రవాహం వున్నప్పుడు బస్సు డ్రైవర్లు కాస్త అప్రమత్తంగా వుండాలని స్థానికులు కోరుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
AndhraPrabha #AndhraPrabhaDigital