నారాయణవనం కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా 8వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 12న అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. 13వ తేదీన ధ్వజారోహణం, పెద్దశేష వాహన సేవ, 14న చిన్నశేష వాహనం, హంస వాహన సేవ, 15న సింహ వాహనం ముత్యపుపందిరి వాహన సేవ నిర్వహించనున్నట్లు తెలిపారు.
16వ తేదీన కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహన సేవ, 17వ తేదీన మోహినీ అవతారం, గరుడ వాహన సేవ, 18వ తేదీన హనుమంత వాహనం, గజ వాహన సేవ, 19వ తేదీన సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహన సేవ, 20న రథోత్సవం, కల్యాణోత్సవం, అశ్వవాహన సేవ, 21న చక్రస్నానం, ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని తెలిపారు.
ఉత్సవాల్లో ఉదయం 7.30 గంటల నుంచి 9.30 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి 930 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయని చెప్పారు. 20న రాత్రి 7.30 నుంచి 9 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం జరుగుతుందని, ఆసక్తి ఉన్న భక్తులు రూ.1000 చెల్లించి పాల్గొనవచ్చని చెప్పారు.