Wednesday, November 20, 2024

ఒక్క విద్యార్థికి కోవిడ్ సోకినా బాధ్యత వహిస్తారా?: ఏపీ సర్కార్ కు లోకేష్ సూటి ప్రశ్న

దేశంలో పరీక్షలు రద్దు చెయ్యని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. రాష్ట్రంలో పరీక్షలు నిర్వహణ ఓ సూపర్ స్ప్రెడర్ కార్యక్రమమని తెలిపారు. ప్రభుత్వం మొండితనంతో 15 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడొద్దని కోరారు. దేశమంతా ఒక దారిలో వెళ్తుంటే అందుకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో నెలకొన్న ఆందోళనను దృష్టిలో పెట్టుకుని తక్షణమే పరీక్షలు రద్దు చెయాలని డిమాండ్ చేశారు. పరీక్షలు రద్దు నిర్ణయాన్ని వెంటనే అఫిడవిట్ ద్వారా సుప్రీం కోర్టుకి తెలపాలన్నారు. పరీక్షల రద్దుకు మద్దతు తెలిపిన దాదాపు 7 లక్షల మంది అభిప్రాయాలను ముఖ్యమంత్రి, గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినా ఉపయోగం లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థుల ప్రాణాలు కాపాడేందుకు పరీక్షలు రద్దు చేయమని రెండు నెలలుగా పోరాటం చేస్తున్నామని లోకేష్ పేర్కొన్నారు. మొండిగా పరీక్షలు నిర్వహిస్తామంటోన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుపై  దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రవ్యాఖ్యల నేపథ్యంలో తక్షణమే పరీక్షలు రద్దు ప్రకటన చేయాలన్నారు. దేశమంతా పరీక్షలు రద్దుచేస్తే ఏపీలో మాత్రమే నిర్వహించి తీరుతామని ఎందుకు పట్టుపడుతున్నారో అర్థం కావడంలేదన్నారు. సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చినా అఫిడవిట్ వేయని సర్కారు .. ఒక్క విద్యార్థికి కోవిడ్ సోకినా బాధ్యత వహించగలదా? అని ప్రశ్నించారు. పోయిన ప్రాణాలు జగన్ రెడ్డి తిరిగి తేగలరా? అని నిలదీశారు. ఇప్పటికైనా ప్రజాస్వామ్య వ్యవస్థల ఆదేశాలని గౌరవించి తక్షణమే పరీక్షల రద్దు నిర్ణయాన్ని ప్రకటించాలని లోకేష్ డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: సెప్టెంబరు-అక్టోబరు మధ్య పీక్స్ కి కరోనా థర్డ్‌వేవ్: ఐఐటీ కాన్పూర్ నివేదిక

Advertisement

తాజా వార్తలు

Advertisement