నంద్యాల – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఆదివారం నాటికి 99వ రోజుకి చేరింది.. ఈ పాదయాత్రలో భాగంగా నేటి ఉదయం శ్రీశైలం నియోజకవర్గంలో నడక కొనసాగించారు లోకేష్. ముందుగా నల్లకాలువ పంచాయతీ సమీపంలో ఉన్న వైఎస్ఆర్ స్మృతి వనం వద్ద వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించి ముందుకు సాగారు.. .
ఈ సందర్భంగా వెలగాము వద్ద కొత్త రామాపురం గ్రామస్తులతో సమావేశం అయ్యారు. గ్రామస్తులు యువనేత లోకేష్‌కు సమస్యలను విన్నవించారు. గత ప్రభుత్వం నిర్మించిన సిద్దాపురం చెరువు లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి మా పొలాలకు పిల్లకాల్వలు తీయించాలన్నారు. అలాగే రైతులకు ఇచ్చిన డ్రిప్స్, స్ప్రింక్లర్లు, నల్లపట్టాలు, స్ప్రేయర్లు, సబ్సిడీపై ట్రాక్టర్లు ప్రస్తుత ప్రభుత్వం రద్దుచేసిందని.. వాటిని పునరుద్దరించాలని కోరారు. గత ప్రభుత్వంలో ప్రారంభించిన సిసి రోడ్ల నిర్మాణపనులను ఇంతవరకు పూర్తిచేయలేదని, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి మిగిలిపోయిన రోడ్లు పూర్తిచేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలులేవని, గత ప్రభుత్వంలో మాదిరి మహిళా సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు.
వారి సమస్యలపై స్పందించిన లోకేష్ మాట్లాడుతూ… జగన్ ప్రభుత్వానికి దోచుకోవడం, దాచుకోవడం తప్ప రైతుల సమస్యలు పట్టడంలేదని విమర్శించారు. సీఎం ముఖం చూసి రాష్ట్రంలో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సిద్దాపురం లిఫ్ట్‌కు అనుబంధంగా పిల్లకాల్వల పనులు పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. డ్వాక్రా సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు విధానాన్ని పునఃప్రారంభించి, రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలుచేస్తామన్నారు. పెట్టుబడులు తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటి చేస్తామని లోకేష్ స్పష్టం చేశారు.
ఇక అటవీ ప్రాంతంలో నారా లోకేష్ ని కలిసిన సేవ్ ది టైగర్ క్యాంపెయిన్ ప్రతినిధులు. ఇండియా వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ సొసైటీ అసిస్టెంట్ డైరెక్టర్ ఇమ్రాన్ సిద్ధిఖీ, సీనియర్ జర్నలిస్ట్ పులిపాక బాలు తదితరులు నారా లోకేష్ తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు.. ఈ సందర్బంగా అడవుల సంరక్షణ , ప్రాదాన్యత తదితర అంశాలపై వారితో లోకేష్ చర్చించారు..
ఆ తర్వాత వెలుగోడు ఫారెస్ట్ కార్యాలయం వద్ద భవన నిర్మాణ కార్మికులతో ముఖాముఖి సమావేశంలో నారా లోకేష్ పాల్గొన్నారు.. నిర్మాణ కార్మికులు తమ సమస్యలు విన్నవించారు.. తాము అందరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు..