ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో- యువగళం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న నారా లోకేష్ పాదయాత్ర విజయవాడ ఎ కన్వెన్షన్ సెంటర్ నుంచి ఆదివారం సాయంత్రం ప్రారంభమైంది. యువనేత లోకేష్ కు సంఘీభావంగా భారీగా రోడ్లపైకి వచ్చిన మహిళలు, యువతీయువకులు సాగర స్వాగతం పలికారు. అడుగడుగునా లోకేష్ కు విజయవాడ ప్రజల ఆత్మీయ స్వాగతం పలికారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు తెలుసుకుంటున్న లోకేష్ పాదయాత్రను నగరంలో కొనసాగించారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు, పన్నులు మోయలేనివిధంగా మారాయని స్థానికులు లోకేష్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
కృష్ణానది చెంతనే ఉన్నా ఇసుక అందుబాటులేక అవస్థలు పడుతున్నామన్న నగరవాసులు తెలిపారు. మరికొద్ది నెలల్లో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలు పరిష్కరిస్తుందని లోకేష్ వారికి భరోసా ఇచ్చారు. భవిష్యత్తుకు గ్యారంటీ కరపత్రాలను ప్రజలకు పంచుతూ వాటి ప్రయోజనాలను వివరిస్తున్న లోకేష్ పాదయాత్ర కొనసాగించారు. యువనేతను కలిసి ఫోటోలు దిగేందుకు పోటీపడుతున్న యువతీయువకులు, మహిళలు ఆప్యాయంగా పలకరిస్తూ వాళ్లతో ఫోటోలు దిగారు. రోడ్డు డివైడర్లు, భవనాలపైకి ఎక్కి యువనేతకు అభివాదం చెబుతున్న నగర ప్రజలను చెయ్యి ఊపి పలకరిస్తూ ముందుకు కదిలారు.