Saturday, November 23, 2024

సీఎం జగన్ కు నారా లోకేష్ లేఖ!

ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ లేఖాస్త్రం సంధించారు. నిరుద్యోగుల డిమాండ్లను నెల రోజుల్లోగా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరుద్యోగుల సమస్య పరిష్కారానికి మరో పోరాటం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఉత్తుత్తి ఉద్యోగ క్యాలెండర్ తో నిరుద్యోగులను నిలువునా ముంచారని విమర్శించారు. మోసపూరిత జాబ్ క్యాలెండ‌ర్ ఉప‌సంహ‌రించుకోవాలని తెలిపారు.

2.3 లక్షల ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాలని లోకేష్ డిమాడ్ చేశారు. పాదయాత్రలో వాగ్దానం చేసినట్లుగా 2,30,000 ఉద్యోగాలతో కొత్త ఉద్యోగ క్యాలెండర్‌ను విడుదల చేయాలన్నారు. 6500కి పైగా ఖాళీగా వున్న ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయాలని సూచించారు. గ్రూప్ 1, గ్రూప్ 2 విభాగాల్లో 2 వేల పోస్టుల‌తో జాబ్ క్యాలెండర్ కొత్త‌గా విడుద‌ల చేయాలన్నారు. 25 వేల ఉపాధ్యాయ ఉద్యోగాల భ‌ర్తీకి 30 రోజుల్లో మెగా డిఎస్‌సి నోటిఫికేష‌న్ ఇవ్వాలన్నారు. ఇంజనీరింగ్ విభాగాలలో 20,000 వేల‌కు పైగా ఖాళీలకు నియామ‌కాలు చేప‌ట్టాలని కోరారు. రెవెన్యూ శాఖలో 740 పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భ‌ర్తీ చేయాలని, ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ యువకుల కుటుంబానికి 25 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. టిడిపి ప్రభుత్వ హ‌యాంలో నిరుద్యోగుల‌కిచ్చిన 2000 నిరుద్యోగ భత్యాన్ని పున‌రుద్ధ‌రించాలని సూచించారు.

లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి, నేడు వందల ఉద్యోగాలకే జాబ్ కాలెండర్ విడుదల చేయడంపై భగ్గుమన్న నిరుద్యోగులు నిరసనకి దిగితే పోలీసులు నిర్బంధించిన తీరు ప్రజాస్వామ్య వ్యవస్థకే సిగ్గు చేటని విమర్శించారు. శాంతియుతంగా నిరసన తెలిపిన నిరుద్యోగులను పోలీసులు అన్యాయంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేసిన వారందరినీ బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా వున్న లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలి నారా లోకేష్ డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement