సింహాచలం అప్పన్నస్వామిని మాజీమంత్రి నారా లోకేష్ ఇవాళ ఉదయం దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయానికి వచ్చిన లోకేష్‌ను అర్చకులు, దేవస్థానం పాలకమండలి సభ్యులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి వేదపండితులు ఆశీర్వచనలు అందజేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు చెప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో శంఖారావం బహిరంగ సభలకు పెద్ద ఎత్తున ఆదరణ లభించిందని, గ్రేటర్ విశాఖపై పట్టు నిలుపుకొంటామని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని ప్రభుత్వం విస్మరించిందని వ్యాఖ్యానించారు.
కాగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ శంఖారావం పేరుతో బహిరంగ సభలను నిర్వహిస్తోన్నారు. జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో పర్యటిస్తోన్నారాయన. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఆయన పర్యటన ముగిసింది. విశాఖపట్నం జిల్లాలో అడుగు పెట్టారు. ఇప్పటికే భీమిలీలో శంఖారావం సభలో ప్రసంగించారు. నేడు గ్రేటర్ విశాఖలో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. శంఖారావం సభలో పాల్గొననున్నారు. ఈ సభకు గ్రేటర్ విశాఖ టీడీపీ నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాస్, వెలగపూడి రామకృష్ణబాబు సహా పలువురు నాయకులు ఇందులో పాల్గొననున్నారు.