Friday, November 22, 2024

విద్యార్థులపై లాఠీ ఛార్జ్.. అణచివేస్తే నేలకొరగడం ఖాయం

ఎయిడెడ్‌ కళాశాలలు, పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు అనంతపురంలో ఆందోళన చేపట్టాయి. ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాల వద్ద విద్యార్థులతో ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌ విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాల, పాఠశాల విలీనాన్ని ఉప సంహరించుకోవాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. యాజమాన్యం ఇప్పటికే విలీనానికి అంగీకరిస్తూ.. అందుకు సంబంధించిన పత్రాన్ని విద్యాశాఖ అధికారులకు సమర్పించింది. దీన్ని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు వ్యతిరేకించాయి. ప్రైవేటు పరం చేస్తే ఫీజుల భారం మోయలేమని ఆవేదన వ్యక్తం చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు కళాశాల వద్దకు చేరుకొని ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో పోలీసులు, విద్యార్థుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కొంతమంది విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో వారు విద్యార్థులపై లాఠీఛార్జ్‌ చేశారు. దీంతో ఓ విద్యార్థినికి తీవ్రగాయాలయ్యాయి. అనంతరం పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకొని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు జులుం ప్రదర్శించారని విద్యార్థులు ఆరోపించారు.

అనంతపురంలో ఎస్‍ఎస్‍బీఎన్ ఎయిడెడ్ కళాశాల దగ్గర విద్యార్థులను పోలీసులు విచక్షణారహితంగా కొడుతూ లాఠీఛార్జ్ చెయ్యడాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఖండించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేయించడం, తలలు పగిలేలా కొట్టించడం జగన్ రెడ్డి అహంకార ధోరణికి నిదర్శనం అని అన్నారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్య సహాయం అందించాలన్నారు. విద్యార్థులపై లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు.. ఎయిడెడ్ కళాశాల ప్రైవేటీకరణ ఆపాలంటూ నిరసన తెలపడం కూడా రాజారెడ్డి రాజ్యాంగంలో నేరమేనా? అని ప్రశ్నించారు. విద్యార్థి ఉద్యమాలు అణిచి వెయ్యాలని చూసిన ఎంతటి నియంత అయినా నేలకొరగడం ఖాయం హెచ్చరించారు. ఎయిడెడ్ విద్యా వ్యవస్థను ధ్వంసం చేసే నిర్ణయాలు వెంటనే వైసీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి ఇచ్చిన జిఓలు రద్దు చెయ్యాలి లోకేష్ డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement