ఇవాళ రెండోరోజు శ్రీకాకుళం జిల్లాలో నారా లోకేష్ శంఖారావం పాదయాత్ర నిర్వహించనున్నారు. జిల్లాలోని నరసన్నపేట, శ్రీకాకుళం, ఆమదాలవలస నియోజకవర్గాల్లో లోకేష్ పర్యటన సాగనుంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు కార్యకర్తలను సమాయత్తం చేస్తూ శంఖారావం యాత్ర సాగుతోంది.
కాగా, శంఖారావం యాత్రలో భాగంగా లోకేష్ ఆదివారం ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి నియోజకవర్గాల్లో సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్పై ఆయన విమర్శల వర్షం కురిపించారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడితే ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. నాలుగేళ్లు పడుకొని ఇప్పుడు డీఎస్సీ అంటున్నారని ఆక్షేపించారు. ‘2.30 లక్షల పోస్టులు భర్తీ చేస్తానని చెప్పి జగన్ మడమ తిప్పాడు. డీఎస్సీలో కేవలం 6వేల పోస్టులు మాత్రమే ఉన్నాయని చెబుతున్నారు. టీడీపీ పాలనలో లక్షా 30 వేల పోస్టులు భర్తీ చేశాం. మళ్లీ వస్తే ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం’ అని ప్రకటించారు.