అనంతపురం జిల్లా హిందూపురంప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ఎనిమిది మంది మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ప్రాణాలు కోల్పోయారంటూ బాధితుల బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై టీడీపీ, బీజేపీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
హిందూపురం ఘటనకు సంబంధించి సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రభుత్వం ఆధిపత్య రాజకీయాలపై చూపించే శ్రద్ధ…. ప్రజలకు ఆక్సిజన్ అందించడంపై చూపెడితే హిందూపురం ఆస్పత్రిలో 8 మంది చనిపోయేవారు కాదన్నారు. ప్రతిపక్షనేతల్ని కక్షగట్టి అరెస్ట్ చేయించేందుకు వాడుతున్న యంత్రాంగాన్ని ప్రజలు ప్రాణాలు కాపాడేందుకు వాడితే కర్నూలు ఆస్పత్రిలో ఆరుగురి ఊపిరి ఆగిపోయేది కాదని తెలిపారు. అధికారులు, పోలీసులు, వలంటీర్లను వాడుకుని తిరుపతి ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించుకోవడంపై పెట్టిన శ్రద్ధ, ప్రాణవాయువు అందించే దానిపై పెట్టి ఉంటే అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో 10 మంది చనిపోయేవారు కాదని ఆయన అన్నారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని ఏదో ఒక అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేయించాలని పదేపదే చేస్తున్న ప్రయత్నాలు, ఉత్తరాంధ్రలోని ఆస్పత్రులలో మెరుగైన సౌకర్యాల కల్పనపై పెట్టి ఉంటే విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక కోవిడ్ పేషెంట్లు చనిపోయి ఉండేవారు కాదన్నారు. ప్రజలకి రక్షగా ఉంటావని ఎన్నుకుంటే, ప్రతిపక్షంపై కక్ష తీర్చుకుంటున్నావు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నిన్ను నువ్వు నమ్ముకున్న దేవుడు కూడా క్షమించడు జగన్ రెడ్డి అని హెచ్చరించారు. హిందూపూర్ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.
మరోవైపు హిందూపురం ఘటనపై బీజేపీ రాష్ట్ర ప్రధాన క్యారదర్శి విష్ణువర్ధన్ రెడ్డి కూడా విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోందని అని తెలిపారు. కరోనాతో బాధితులు ప్రైవేటు ఆస్పత్రుల కంటే ప్రభుత్వ ఆస్పత్రలకే వస్తున్నారని పేర్కొన్నారు. ఘటనకు కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.