ఏపీలో జగన్ సీఎం అయ్యాక మహిళలపై దాడులు పెరిగాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. సొంత చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రంలో మహిళలకేం న్యాయం చేస్తారని ఆయన ప్రశ్నించారు. గుంటూరులో రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లగా నారా లోకేశ్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. చివరికి పెదకాకాని పీఎస్ నుంచి విడుదల చేశారు. లోకేశ్‌పై 151 సీఆర్పీసీ కింద అభియోగాలు నమోదు చేశారు. నోటీసులపై సంతకం పెట్టించుకున్న తర్వాత లోకేశ్‌ను విడిచిపెట్టారు. ఈ సందర్భంగా లోకేశ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసేవాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని లోకేశ్ హెచ్చరించారు. రాష్ట్రంలో ఆడపిల్లలను కాపాడాలని ఫిర్యాదు చేస్తే రక్షణ కల్పించలేని పరిస్థితి ఉందన్నారు. టీడీపీ నాయకులు, మహిళా కార్యకర్తలపై వేధింపులు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. వైసీపీ నేతల తీరు వల్లే రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగాయన్నారు. జగన్‌రెడ్డి సీఎం అయ్యాక 500 మంది మహిళలపై దాడులు జరిగాయని ఆరోపించారు. దిశ చట్టం ప్రకారం రాష్ట్రంలో ఏ ఒక్కరికీ శిక్ష పడలేదని తెలిపారు. తాను ఏ తప్పు చేశానని అరెస్ట్ చేశారని లోకేశ్ ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి అండగా ఉండటమే తాము చేసిన తప్పా? అని ఆయన నిలదీశారు. 20 రోజుల్లో నిందితుడికి శిక్ష పడకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారని లోకేశ్ హెచ్చరించారు.
గుంటూరులో హత్యకు గురైన బీటెక్ విద్యార్థి రమ్య కుటుంబాన్ని టీడీపీ నేతలు పరామర్శించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. లోకేశ్‌ను పోలీసులు సోమవారం మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. లోకేశ్‌తో పాటు టీడీపీ నేతలు ధూళిపాళ్ల, ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబును కూడా అదుపులోకి తీసుకున్నారు. లోకేశ్ పై 151 సీఆర్పీసీ కింద అభియోగాలు నమోదు చేశారు.
విడుదలకు ముందు, పోలీసులు లోకేశ్ తో నోటీసులపై సంతకం పెట్టించుకున్నారు. కాగా పోలీసులు లోకేశ్ ను తమ కాన్వాయ్ లోనే తరలించి, పొన్నూరు చుట్టుపక్కల డొంక రోడ్లలో తిప్పారు. ప్రత్తిపాడు పోలీస్‌స్టేషన్ నుంచి పెదనందిపాడు, పొన్నూరు మీదుగా ఆయనను గుంటూరుకు తరలించారు.
ఇది కూడా చదవండిః దళితబంధుకు నా భార్య ఆశీర్వాదం.. అవి ఆగవు: సీఎం కేసీఆర్