రాజోలు: టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిరసనకు దిగారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తున్నారనే సమాచారంతో తొలుత కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలాడలో ఉన్న లోకేష్ విజయవాడ బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో రాజోలు సీఐ గోవిందరాజుతో లోకేశ్ వాగ్వాదానికి దిగారు. ఏ విధమైన నోటీసు ఇవ్వకుండా ఎలా అడ్డుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
”నా వెంట నాయకులు ఎవరూ రావడం లేదు. కుటుంబ సభ్యుడిగా నేను ఒక్కడినే వెళ్తున్నాను. అడ్డుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారు” అంటూ లోకేష్ నిలదీశారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా క్యాంప్ సైట్ వద్ద తన బస్సు ముందే బైఠాయించి లోకేష్ నిరసన తెలిపారు. మరోవైపు మీడియాను కూడా లోకేశ్ బస చేసిన ప్రదేశానికి రానీయకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. లోకేష్ క్యాంప్ సైటులోకి నీరు, ఆహార పదార్థాలు రాకుండా అడ్డుకుంటున్నారు. లోకేశ్ భద్రతాధికారి జిల్లా ఎస్పీకి ఫోన్ చేశారు. స్థానిక పోలీసు అధికారులు వచ్చి మాట్లాడతారని ఎస్పీ బదులిచ్చారు. పోలీసుల తీరు పట్ల టీడీపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.