Tuesday, November 5, 2024

Nara Lokesh | మెగా డిఎస్సీకి పకడ్బందీగా ఏర్పాట్లు

రాష్ట్రంలో మెగా డిఎస్సీని పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని విద్యా శాఖా మంత్రి నారా లోకేష్‌ అధికారులను ఆదేశించారు. స్కూల్‌ ఎడ్యుకేషన్‌, ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ పై మంత్రి లోకేష్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ… మెగా డిఎస్సీ నిర్వహణ విధివిధానాలపై సమావేశంలో చర్చించారు.

సాధ్యమైనంత ఎక్కువమంది అభ్యర్థులకు అవకాశం కల్పించాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలోని ఉత్తమ ఉపాధ్యాయులకు ఈనెల 11వతేదీన నిర్వహించే కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ఇవ్వాలని నిర్ణయించారు. పాఠశాలల్లో విద్యాప్రమాణాల మెరుగుపర్చే చర్యల్లో భాగంగా తల్లిదండ్రులను భాగస్వాములను చేస్తూ డిసెంబర్‌ మొదటివారంలో మెగా పిటిఎం (పేరెంట్స్‌, టీచర్స్‌ మీటింగ్‌) నిర్వహించాలని మంత్రి లోకేష్‌ సూచించారు.

వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలు పూర్తిచేయాలని అన్నారు. రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు అపార్‌ ఐడి కార్యక్రమం ఇప్పటివరకు 57.48శాతం పూర్తయిందని అధికారులు తెలుపగా, సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలని చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ రిపోర్టు కార్డులు అందజేయాలని సమావేశంలో నిర్ణయించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్‌ ర్యాంకింగ్స్‌ పై దృష్టి సారించాలని అన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని, ఇందులో భాగంగా అటెండెన్స్‌ మెరుగుదలకు చర్య తీసుకోవాలని కోరారు.

రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాలైన టాయ్‌ లెట్స్‌, వాటర్‌, బెంచీలు, లీక్‌ ప్రూఫ్స్‌ భవనాలు, పెయింటింగ్స్‌ వంటివాటిపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రం మొత్తాన్ని నాలుగుజోన్లుగా విభజించి విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో మెనూలో మార్పులు చేసే అంశాన్ని పరిశీలించాలని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement