ఏపీలో టీడీపీ నేతలే టార్గెట్ గా అరెస్టులు, దాడులు జరుగుతున్న నేపథ్యంలో తెలుగు తమ్ముళ్ల కోసం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కార్యకర్తల కోసం ఐటీడీపీ బ్లాగ్.కామ్ పేరుతో ఒక వెబ్ సైట్‌ను ఏర్పాటు చేశారు. దీనిని నారా లోకేష్ ప్రారంభించారు. సోషల్ మీడియాలో నిత్యం క్రియాశీలకంగా ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఈ వెబ్ సైట్ ను రూపొందించారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టింగుల పేరుతో ప్రభుత్వ వేధింపులు, కేసులను ఎదుర్కొంటున్న పార్టీ కార్యకర్తలు, ఇతరులు, ప్రభుత్వ పథకాల్లో కోత, అనర్హతగా ప్రకటించినా, ఇతరత్రా కేసులు, వేధింపులు ఎదురైతే ఈ వెబ్‌సైట్ ద్వారా ఆ సమస్యలను పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకురావొచ్చు.
సోషల్ మీడియాలో పెట్టే పోస్టులపై పోలీసుల నుంచి గానీ, వైసీపీ నుంచి గానీ ఇబ్బందులు ఎదురైతే వెబ్ సైట్ లో ఉండే వాట్సాప్ లింకు ద్వారా సమాచారం అందించాలని లోకేష్ కార్యకర్తలకు సూచించారు. ఈ వెబ్ సైట్ ద్వారా ఇబ్బందుల్లో ఉన్న కార్యకర్తలకు అండగా నిలుస్తామని లోకేష్ అన్నారు. అవసరమైన వారికి న్యాయ సహాయం కూడా అందిస్తామన్నారు. ఈ విభాగం ఇంఛార్జ్‌గా ఉన్న చింతకాయల విజయ్, మిగిలిన టీమ్ కష్టపడ్డారని ప్రశంసించారు. ప్రశ్నిస్తే కేసు, పోరాడితే అరెస్ట్ ఇంకెన్నాళ్లీ అరాచక పాలన.. రాజారెడ్డి రాజ్యాంగాన్ని చెత్తబుట్టలో పడేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తుగ్లక్ అక్రమాలను బయటపెట్టి ప్రజలకు అండగా నిలుస్తున్న ఐటీడీపీ సభ్యులకు అండగా నిలుస్తామన్నారు. సోషల్ మీడియా కేసులంటూ పోలీసులు ఇబ్బంది పెట్టినా, చిల్లర గ్యాంగులు బెదిరించినా https://itdpblog.com వెబ్ సైట్ లో ఉన్న వాట్సప్ లింక్ ఉపయోగించి సమాచారమివ్వాలని సూచించారు. న్యాయ సహాయంతో పాటు పార్టీ మీకు అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. అరాచక పాలన నుంచి ప్రజల్ని కాపాడుకోవడానికి ఐటీడీపీ లో కార్యకర్తలంతా భాగస్వామ్యం అవ్వండని కార్యకర్తలకు నారా లోకేష్ పిలుపునిచ్చారు.