పోలీసుల తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కొడాలి నాని పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై టిడిపి నేత బుద్ధా వెంకన్న అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
“గుడివాడలో కొడాలి నాని క్యాసినో నడిపితే నో పోలీస్..
అదే గడ్డం గ్యాంగ్ ప్రతిపక్షనేతని బూతులు తిడితే నో పోలీస్.. చంద్రబాబు గారి ఇంటి పై దాడి చేస్తే నో పోలీస్..
టిడిపి కేంద్ర కార్యాలయాన్ని వైసీపీ మూకలు ధ్వంసం చేస్తే నో పోలీస్.. బూతులేంట్రా సన్నాసి నాని అని బుద్ధా వెంకన్న నిలదీస్తే బిలబిలమంటూ వచ్చి అరెస్ట్ చేశారు పోలీస్.
ఏపీ పోలీసులు ప్రజారక్షణకి ఉన్నారా? నేరాలు చేసే వైసీపీ నేతలకు కాపలా కాస్తున్నారా? బుద్ధా వెంకన్న అరెస్ట్‌ని తీవ్రంగా ఖండిస్తున్నాను. క్యాసినో వ్యవహారంపై టిడిపి నేతలు ఫిర్యాదు చెయ్యడానికి వెళితే కనీసం అనుమతించని డీజీపీ గారు ఐపీఎస్ ముసుగులో ఎన్నాళ్లిలా వైసీపీ కోసం పనిచేస్తారు? వైసీపీలో చేరితే వాటాల్లేకుండా మీరే క్యాసినో నడుపుకోవచ్చు” అని నారా లోకేష్ మండిపడ్డారు.