అమరావతి – ఎపి అసెంబ్లీ లో వైసిపి , టిడిపి ఎమ్మెల్యేలు ఘర్షణకు దిగారు..ఒకరిపై ఒకరు దాడి చేసుకునేందుకు యత్నించారు..ఈ దాడిలో టిడిపి ఎమ్మెల్యేలు బాలాంజనేయులు, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు తోపులాటలో కిందపడిపోయారు.. దీనిపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు..ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.
” ప్రజాస్వామ్య విలువలకి నిలువెత్తు సంతకంలా నిలిచే సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై ప్రజాస్వామ్య దేవాలయం అసెంబ్లీలోనే వైసీపీ దాడికి తెగబడటం దారుణం. బుచ్చయ్య తాతపై దాడి దేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే బ్లాక్ డే. ఏడుపదుల వయస్సు దాటిన పెద్దాయనని చూస్తేనే చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది, దాడికి మీకు మనసు ఎలా ఒప్పింది? అధికారం కోసం సొంత బాబాయ్‌నే వేసేసినోళ్లు, బుచ్చయ్య తాతని గౌరవిస్తారనుకోవడం వృథా ప్రయాస. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి కర్రుకాల్చి వాత పెట్టినా ఫ్యాక్షన్ బుద్ధి మారలేదు. దళితులపై వైసీపీ దమనకాండ అసెంబ్లీలోనూ కొనసాగింది. దళిత మేధావి, అజాతశత్రువు, కొండెపి ఎమ్మెల్యే డాక్టర్ బాల వీరాంజనేయ స్వామిపై దాడి ప్రజాస్వామ్య వ్యవస్థకే కళంకం. బ్రిటీష్ కాలంనాటి జీవో1 తెచ్చి ప్రజాస్వామ్యం గొంతు నొక్కొద్దని అసెంబ్లీలో లేవనెత్తడం దళిత ఎమ్మెల్యే చేసిన పాపం అన్నట్టు వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. దళిత ఎమ్మెల్యే డాక్టర్ డోలా బాల వీరాంజనేయస్వామిపై దాడి చేయించడం ద్వారా తన ప్రయాణం నేరాలతోనే.. తన యుద్ధం దళితులపైనే అని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మరోసారి నిరూపించుకున్నారు ” అంటూ నారా లోకేష్ వ్యాఖ్యానించారు.