గుంటూరు, ఆంధ్రప్రభ : మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల సందర్భంగా గుంటూరు నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పై దాడికి యత్నం జరిగింది. నగరంలోని ఆర్టీసీ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముందస్తు సమాచారం లేకుండా ఎమ్మెల్యే వచ్చాడని ఓవర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఐటి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అక్కడికి వెళ్లారు. సమాచారం లేకుండా అక్కడకు వెళ్లిన ఎమ్మెల్యేపై ఓవర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఇరువర్గాలు బాహాబాహికి తలపడ్డారు. ఎమ్మెల్యే పై ఓవర్గం దాడికి ప్రయత్నించడంతో సెక్యూరిటీ అడ్డుకున్నారు. ఈ సంఘటనలో నజీర్ అహ్మద్ కు స్వల్ప గాయాలు కావడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ సంఘటనతో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఒక్కసారిగా తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.