కర్నూలు – నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నారా భువనేశ్వరి కర్నూలు జిల్లా పత్తికొండలో పర్యటిస్తున్నారు. ఇంటర్ పూర్తి చేసుకుని ఉన్నత చదువులకు వెళ్ళాలి అనుకునే విద్యార్ధినుల కోసం ‘కలలకు రెక్కలు’ అనే కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ పథకం కింద ప్రొఫెషనల్ కోర్సు లు నేర్చుకునే విద్యార్ధినులకు ప్రభుత్వ గ్యారెంటీ తో బ్యాంక్ రుణాలు, విద్యార్థినులు బ్యాంక్ నుంచి పొందే రుణాలకు వడ్డీ పూర్తిగా ప్రభుత్వమే చెల్లించేలా కొత్త కార్యక్రమాన్ని నారా భువనేశ్వరీ ప్రకటించారు. టీడీపీ – జనసేన అధికారంలోకి వచ్చిన తరువాత ఉమ్మడి ప్రభుత్వంలో కలలకు రెక్కలు కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో పత్తికొండ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, కేఇ శ్యామ్ బాబు మాట్లాడుతూ… మీకోసం ఎవరు పనిచేస్తారనుకుంటారో వారినే ప్రజలు ఎన్నుకోవాలన్నారు. తాయిలాలు, ఆకర్షించే మాటలకు లొంగి మీ జీవితాన్ని పాడుచేసుకోవద్దని హితవు పలికారు. తెలుగుదేశం-జనసేన ప్రభుత్వంతో యువతకు బంగారు భవిష్యత్తు గ్యారెంటీగా ఉంటుందన్నారు. నారా లోకేష్ సారథ్యంలో యువతకు అవకాశాలు, ఉద్యోగాలు మెండుగా వస్తాయన్నారు. రానున్న ఎన్నికల్లో యువత మీ భవిష్యత్తుకు ఓటు వేయాలని మనవి చేశారు.
కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షులు బీటీ నాయుడు మాట్లాడుతూ…ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పించారన్నారు. చంద్రబాబు ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా యువతను, మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించారన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం యువతను, మహిళలను అణగదొక్కుతోందన్నారు. జగన్మోహన్ రెడ్డి ఓట్లను దొంగతనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఓట్లు దొంగతనం చేసి, రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి వంటి దుర్మార్గులకు బుద్ధి చెప్పాలంటే ఓటే మనకు వజ్రాయుధమన్నారు. ఓటుతోనే శత్రువులను ధీటుగా ఎదుర్కొని, సంక్షేమ పాలనకు పట్టం కట్టాలన్నారు.
టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ… జగన్మోహన్ రెడ్డి ఎంపీ సీటు కోసం బాబాయ్ నే చంపేశాడన్నారు.
నారా లోకేష్ పాదయాత్ర చేస్తానని చెప్పిన సమయంలో భువనేశ్వరి చాలా ఆవేదన చెందారన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం నారా లోకేష్ ను భువనేశ్వరి ఆశీర్వదించి పాదయాత్రకు పంపించారన్నారు. చంద్రబాబు కష్టకాలంలో ఉన్న సమయంలో ఆ విషయాన్ని తట్టుకోలేక మృతిచెందిన పార్టీ కుటుంబ సభ్యులను నేరుగా వెళ్లి పరామర్శించి, వారికి తోడుగా నిలుస్తున్నారనీ తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా భువనేశ్వరి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు. భువనేశ్వరి కష్టపడే మనస్తత్వం కలిగిన మహిళగా నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తారన్నారు. దుర్మార్గుల పాలనను ఎదుర్కొనేందుకు ఓటును ప్రతి ఒక్కరూ ఆయుధంగా మలచుకోవాలన్నారు. చంద్రబాబు మహిళలు, రైతులు, యువతకు అందించిన సంక్షేమ కార్యక్రమాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఓటు వేసే ముందు ఎవరికి ఓటు వేస్తున్నాం, ఎందుకు వేస్తున్నాం ? అనేది ఆలోచించి ఓటు వేయాలన్నారు.