అమరావతి, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ పొలిటికల్ యాక్షన్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ అక్టోబర్ 2న నారా భువనేశ్వరి నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించారు. శనివారం నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన ప్రాంతంలోనే టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ- సమావేశం జరిగింది. ఈ సమావేశం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలో జరగగా, నారా లోకేష్ జూమ్‌లో పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్న ఆ పార్టీ ఇప్పుడు మరో కొత్త కార్యక్రమానికి పిలుపునిచ్చింది.
అక్టోబర్ 2 రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు ప్రతి ఇంట్లో లైట్లన్నీ ఆర్పి ప్రజలు నిరసన తెలపాలని విజ్ఞప్తి చేసింది. లైట్లు ఆపి వరండాలో కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేయాలని సూచించారు. టీడీపీ-జనసేన సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ జేఏసీ రాష్ట్రస్థాయిలో పనిచేస్తూ రెండు పార్టీలకు అవసరమైన కార్యాచరణ, విధివిధానాలను రూపొందించేలా ప్లాన్ చేశారు.
అలాగే ప్రభుత్వ వ్యతిరేక పోరాటాల్లో జనసేనతో సమన్వయం చేసుకుంటూ టీడీపీ కార్యకలాపాలు ఉండేలా కార్యాచరణను ఖరారు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ సమావేశంలో నేతలు వైసీపీ తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ పై సంబంధం లేని ఆరోపణలు చేస్తున్నారని, అసలు అక్కడ ఇన్నర్ రింగ్ రోడ్డే లేనప్పుడు కేసులు ఏంటని ప్రశ్నించారు. అసలు భూసేకరణ కూడా జరగలేదని,ఏమీ జరగని చోట ఏదో జరిగిందనే భ్రాంతికి గురిచేస్తున్నారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పీఏసీ కమిటీ చంద్రబాబుకు మద్దతు తెలిపినవారికి, బాసట గా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలిపింది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనంతరం ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలు, తదుపరి చేపట్టాల్సిన కార్యక్రమాలపై యాక్షన్ కమిటీ భేటీలో చర్చించారు. బాబుతో నేను కార్యక్రమంతో పాటు ఓటర్ వెరిఫికేషన్‌ను ముందుకు తీసుకువెళ్ళాలని నిర్ణయించారు. ఇకపై జనసేనతో కలిసి కార్యక్రమాలు నిర్వహించే అంశంపై కూడా యాక్షన్ కమిటీ చర్చించింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు టీ-డీపీ పూర్తి మద్దతు ప్రకటించింది. జనసేన వారాహి యాత్రలో టీ-డీపీ శ్రేణులు నేరుగా పాల్గొనే విధంగా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు పార్టీలు కలిసి పని చేయడానికి అవసరమైనా ఉమ్మడి కార్యాచరణను త్వరలో రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, యనమల రామకృష్ణుడు, నక్కా ఆనంద్‌బాబు, అశోక్ బాబు, బీద రవిచంద్ర, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత తదితరులు పాల్గొన్నారు.