ఆంధ్ర్రప్రభ స్మార్ట్ – నంద్యాల – నంద్యాలలో ఇటీవల హత్యకు గురైన వైసీపీ నేత సుబ్బారాయుడి కుటుంబాన్ని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ నేడు పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారని కూటమి ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు. ఊళ్లలో ఆధిపత్యం కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని అన్నారు. రాళ్లు, రాడ్లు, కత్తులతో గ్రామంలో దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని అన్నారు.
రాష్ట్రంలో ఆరాచక పాలన జరుగుతుందని అన్నారు. సీఎం చంద్రబాబు మహిళలను మోసం చేశారని చెప్పారు. ప్రతి విద్యార్థికి రూ. 15 వేలు ఇస్తానని చెప్పి మోసం చేశారని అన్నారు. ఎన్నికల సమయంలో మాయ మాటలు చెప్పారని.. మన ప్రభుత్వమే ఉండి ఉంటే ఇప్పటికే అందరికి రైతు భరోసా అందేది అని అన్నారు.
అంతకు ముందు నంద్యాల పర్యటనకు జగన్ విమానంలో ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు, నేతలు, కార్యకర్తలు అభిమానులు విమానాశ్రయం వద్ద ఆయనకు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి నంద్యాల బయలుదేరి ఆయనకు ఓర్వకల్లు నుంచి దారి పొడవునా అడుగడుగునా జనం నీరాజనం పలకడం గమనార్హం. ఆయనకు ఘన స్వాగతం పలికిన వారిలో కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, హఫీస్ ఖాన్, కర్నూల్ మేయర్ బివై రామయ్య, తదితరులు ఉన్నారు.