Sunday, October 6, 2024

Nandivelugu – అటు రైల్వే గేటు .. ఇటు కార్పొరేషన్ బ్రేక్ – నడుమ ఆర్ఓబీ వెక్కిరింత

ఏడేళ్ల నరకం!
ప‌క్కన సర్వీసు రోడ్డు పరిహాసం
నంది వెలుగు ప్రాజెక్డుకు వీడని ఏలినాటి శని
ఇప్పుడిప్పుడే నేతల్లో చలనం
కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని ఫోకస్

పాలకుల అస్తవ్యస్త విధానాలు ప్రజలకు అవస్థలుగా మారుతున్నాయి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా అభివృద్ధి పనులకు గండి తప్పటం లేదు.. ఏపీలో కీలక కేంద్ర బిందువుల్లాంటి విజయవాడ, గుంటూరు నగరాలను రాజకీయ వైషమ్యాలు పట్టి పీడిస్తున్నాయి. ఒకరు పునాది వేస్తే.. మరొకరు సమాధి చేస్తారు. మధ్య జనం మాత్రం సమస్యలతో సతమతం కావటం తథ్యం. ఎన్నికలొచ్చినప్పుడు జనం యథావిథిగా అధికార పార్టీ భరతం పట్టం కూడా షరా మామూలే. తాజాగా రాజకీయ పార్టీల మధ్య ఆధిపత్య పోరాటంలో.. గుంటూరు ప్రజలకు కీలకంగా మారిన నందివెలుగు రైల్వే ఫ్లై ఓవర్ నిర్మాణం అటకెక్కింది.
రైల్వే, నగర పాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో 2017 లో రూ.50 కోట్ల అంచనాలతో చేపట్టిన నిర్మాణం ఇప్పటికీ ముందుకు సాగడం లేదు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఫ్లై ఓవర్‌కు భూమి పూజ చేశారు. ఆ తర్వాత పనులు వేగవంతంగానే కొనసాగాయి. పిల్లర్ల పని మొత్తం పూర్తయింది. రైల్వే గేటుపై స్లాబు పనులు పూర్తి చేశారు. ఈలోగా ప్రభుత్వం మారింది. పని ఆగింది. ఇటు నిధులు లేవని కార్పొరేష‌న్‌ గగ్గోలు.. పని సాగితే కదా సాయం ఇచ్చేది అని రైల్వే శాఖలు వంకలు చూపిస్తున్నాయి. ఇటు సీఎం చంద్రబాబు.. అటు కేంద్ర మంత్రి పెమ్మసాని.. కలుగజేసుకుంటే.. ఈ ఫ్లై ఓవర్ సమస్య తీరుతుందని .. గుంటూరు జనం ఆశపడుతున్నారు. అంతే కాదు.. గుంటూరు మీదుగా తెనాలి, రేపల్లె, బందరు మీదుగా త్వరగా తమ గ్రామాలకు చేరుకుంటామని భీమవరం, రాజమండ్రి, కోనసీమ కాకినాడ తదితర ఉభయ గోదావరి గ్రామీణ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నారు.

ఆంధ్రప్రభ స్మార్ట్, ఉమ్మడి గుంటూరు జిల్లా బ్యూరో :

ఏడేళ్లుగా నందివెలుగు రైల్వే ఫ్లై ఓవర్నిర్మాణ ప్రాజెక్టు గర్భస్థ శిశువు దశలో కునారిల్లుతోంది. ఈ పనులకు అప్రకటిత బ్రేక్ పడింది. అటు ఇటు కాని స్థితి ఏర్పడింది. ఫలితంగా జనం నరకయాతన అనుభవిస్తున్నారు. తమ ఘోష వినే నాథుడి కోసం .. పంటి బిగువున ఈ యాతన భరిస్తున్నారు. గుంటూరు నగరానికి నందివెలుగు ఆర్ఓబీ ఎంతో కీలకం. ముఖ్యంగా చెన్నై, విజయవాడ నుంచి గుంటూరులోకి సులభ మార్గం. ఆర్ఓబీ నిర్మాణంలో పాత గుంటూరు నందివెలుగు రోడ్డును 120 అడుగుల రోడ్డుగా విస్తరించారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ రోడ్డును అభివృద్ధి చేశారు. ఆర్ఓబీ పూర్తయితే రాకపోకలకు అను వుగా నగరపాలక సంస్థ ఏర్పాట్లు చేసింది. కానీ ప్రభుత్వం మారింది. నగర పాలకలూ మారారు. పనులకు నిధుల విడుదల కూడా ఆటోమేటిక్ గా ఆగిపోయింది.

- Advertisement -

ఎవరి చావు ,, వారికే..

ఆర్ఓబీ నిర్మాణం నిలిచిపోవడంతో గుంటూరు కొత్త నరకం ఆవర్భవించింది. ప్లై ఓవర్ పనుల నిమ్మిత్తం ఆ ప్రాంతం మొత్తం దారి మళ్లింది. ఒక వైపు రైల్వేగేటు గోల.. మరో వైపు ట్రాఫిక్ రద్దీ..ఇక చూడాలి .. గుంటూరు ప్రజలే కాదు.. తెనాలి, బాపట్ల, రేపల్లె జనం అయిదేళ్లుగా.. గుంటూరు కార్పొరేషన్ విధించిన శిక్షను అనుభవిస్తున్నారు. జనం ఎవరి చావు వాళ్లు చస్తున్నట్టుగా.. . రైల్వే గేటు పడగానే ట్రాఫిక్ స్థంభిస్తుంది. ఏం చేయాలో అర్థం కాక వాహనదారులు తమను తాము తిట్టుకుంటూ తీవ్ర అసహనానికి గురవుతున్నారు. దీనికి తోడు సర్వీస్ రోడ్లు అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఆర్ వోబీ కి అదనంగా సర్వీసు రోడ్డు సమస్యలూ మరో బోనస్ గా నిలలిచాయి. రాకపోకలకు మరింత ఇబ్బందికరంగా మారింది. వర్షాకాలంలో ఈ సమస్య మరింత జటిలంగా మారుతుంది. నిర్మాణం పూర్తికాని ఆర్ఓబి పరిసరాల్లో వర్షపు నీరు నిలుస్తుండడంతో వాహనదారులు, స్థానికంగా నివాసం ఉండే గృహవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్ఓబీ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని గతంలో స్థానికులు పలు పోరాటాలు చేశారు.

ఎవరి ఘోష వారిదే..

గత ఏడు సంవత్సరాలుగా ఆర్ఓబీ నిర్మాణం పూర్తి కాకపోవడంతో నరకయాతన అనుభవిస్తున్నామని స్థానికుడు కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణం పూర్తి కాకపోవడంతో తాము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. నగరపాలక సంస్థ అధికారులకు పలుమార్లు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఏ కరువు పెట్టిన స్పందించలేదని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ఇప్పటికైనా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

పని పూర్తయితే… ఎంత బాగుంటుందో

నందివెలుగు ఆర్ఓబి నిర్మాణం పూర్తయితే జాతీయ రహదారి నుంచి గుంటూరు నగరంలోకి ప్రవేశించే వాహనాలకు ఎంతో అనువుగా ఉంటుంది. ముఖ్యమంత్రి తదితర ప్రముఖుల సభలు గుంటూరు నగరంలో జరిగే సమయంలో నగర ట్రాఫిక్ ను ఈ మార్గం గుండా మళ్లించవచ్చు. పెదకాకాని వై- జంక్షన్ వద్ద ట్రాఫిక్ జామ్ అయితే ప్రత్యామ్నాయంగా నందివెలుగు మార్గం నుంచి నగరంలోకి రాకపోకలను సాగించవచ్చు. ఇంత కీలకమైన ఆర్ఓబి గత 7 సంవత్సరాలుగా నిర్మాణం నిలిచిపోవడం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది.

కేంద్రమంత్రి పెమ్మసాని ఫోకస్

గుంటూరు పార్లమెంటు సభ్యులు, కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నందివెలుగు ఆర్ఓబీ పై ఫోకస్ పెట్టారు. ఇటీవల ఆయన నగరపాలక సంస్థ కమిషనర్, అధికారులతో ఈ నిర్మాణం పై సమీక్ష నిర్వహించారు. ఇందుకు సంబంధించిన అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణం ఎందువల్ల నిలిచిపోయిందో కారణాలను రాబట్టారు. రైల్వే, నగరపాలక సంస్థ మధ్య కొరవడిన సమన్వయాన్ని ఆయన ప్రశ్నించారు. నగరానికి ఇంత ప్రాధాన్యత కలిగిన ఆర్ఓబి నిర్మాణ విషయంలో నిర్లక్ష్యం వహించడం మంచిది కాదన్నారు. రైల్వే, నగరపాలక సంస్థ అధికారులతో సమీక్షించిన తర్వాత నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని పెమ్మసాని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement