ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వంటి సీనియర్ లీడర్ల అవసరం కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరమని ఏఐసీసీ సెక్రటరీ మయ్యప్పన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకే కిరణ్ రెడ్డి ఢిల్లీకి వచ్చి ఉంటారన్న మయ్యప్పన్.. ఆయనకు ఏ బాధ్యత అప్పగించాలన్న విషయంపై పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. పార్టీ వల్ల పదవి, అధికారం, ప్రయోజనాలు పొందిన వారు పార్టీకి తిరిగి సేవలు చేయాల్సిన అవసరం వచ్చిందన్న ఆయన.. ఆ విషయాన్ని ఉదయ్‌పూర్ వేదికగా జరిగిన చింతన్ శిబిర్‌లో చర్చించినట్టు తెలిపారు.
ఇక.. కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి యాక్టివేట్ కావాల్సిన అవసరాన్ని తనతో పాటు పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్చార్జి ఉమెన్ చాందీ ఇప్పటికే పలుమార్లు సూచించారని తెలిపారు. రాష్ట్ర స్థాయిలోనైనా, జాతీయ స్థాయిలోనైనా కాంగ్రెస్ పార్టీకి సేవలందించాలని ఆయనను కోరినట్టు తెలిపారు. ఆ దిశగా ఆలోచించిన మీదటే కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ టూర్‌కు వచ్చి ఉంటారన్నారు మయ్యప్పన్.. ఇది ఆహ్వానించదగిన విషయమేనని తెలిపారు.