Sunday, November 24, 2024

నల్లమల ఎర్ర దొంగల ముఠా అరెస్ట్.. నిందితుల్లో సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్

కడప, ప్రభన్యూస్‌ బ్యూరో : వైయస్సార్‌ కడప జిల్లా కాశినాయన మండలం నల్లమల అటవీ ప్రాంతంలోని జింకపిల్లగొంది వద్ద ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి ఒక టన్ను బరువున్న 57 ఎర్రచందనం దుంగలు, ఒక కారు, 2 మోటారు సైకిళ్లు, 5 సెల్‌ఫోన్లు 4 గొడ్డళ్లు, 4 రాళ్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ కెకెఎన్‌ అన్బురాజన్‌ తెలిపారు. అరెస్టు అయిన వారిలో సి.ఆర్‌.పి.ఎఫ్‌ కానిస్టేబుల్‌ కూడా వున్నారన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ, మైదుకూరు డి.ఎస్పీ ఎస్‌.ఆర్‌ వంశీధర్‌ గౌడ్‌కు ఎర్రచందనం అక్రమ రవాణా గురించి సమాచారం అందిందన్నారు. డి.ఎస్పీ ఆదేశాల మేరకు ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్‌ సి.ఐ నాగభూషణం పర్యవేక్షణలో పోరుమామిళ్ల ఇన్చార్జ్‌ ఎస్‌.ఐ టి హరిప్రసాద్‌, కాశినాయన పోలీసు, టాస్క్‌ ఫోర్స్‌ సిబ్బంది మంగళవారం ఉదయం కాశినాయన మండలం సావిశెట్టిపల్లె గ్రామానికి పడమర దిక్కున సుమారు 4 కిలోమీటర్ల దూరంలోని నల్లమల అటవీ ప్రాంతంలోని జింకపిల్ల గొంది వద్ద దాచి వుంచిన ఎర్రచందనం మొద్దులను అక్రమగా తరలించేందుకు కారులో లోడ్‌ చేస్తుండగా దాడులు నిర్వహించామన్నారు.

ఈ దాడుల్లో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న కలసపాడుకు చెందిన సగిలి భాస్కర్‌, ప్రకాశం జిల్లా పాయలపల్లి గ్రామానికి చెంది, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో 212 బెటాలియన్‌ సి.ఆర్‌.పి.ఎఫ్‌ కానిస్టేబుల్‌ తెలిక రమణయ్య, ఖాజీపేట మండలం పత్తూరు గ్రామానికి చెందిన సారె వెంకట సుధాకర్‌, పత్తూరు నాగభూషణం (మాజీ అటవీశాఖ ప్రొటెక్షన్‌ వాచర్‌) లను అరెస్టు చేశామన్నారు. సంఘటనా స్థలంలో మరి కొంత మంది పరార్‌ అయ్యారని, వారిని త్వరలో పట్టుకుని వీరిపై పి.డి యాక్ట్‌ నమోదు చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలెవరైనా మీ దృష్టికిఇలాంటి అక్రమ కార్యకలాపాల గురించి సమాచారం తెలిస్తే తమకు తెలియ చేయాలని, మీ వివరాలు గోప్యంగా వుంచి నేరస్తుల పై కఠిన చర్యలు తీసుకుంటామనిఎస్పీ విజ్ఞప్తి చేశారు. ముద్దాయిలను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరచిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement