పసికందును రోడ్డుపై వదిలేసిన వైనం
ఆసుపత్రికి తరలించిన స్థానికులు
అక్కున చేర్చుకున్న సీడీపీఓ ఉమామహేశ్వరీ
తల్లిదండ్రుల కోసం అధికారులు, పోలీసులు గాలింపు
(ఆంధ్రప్రభ స్మార్ట్, నాయుడుపేట) : బిడ్డ కోసం నవమాసాలు మోసింది ఆ మాతృమూర్తి.. పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది.. ఇంతలోనే ఆ తల్లికి ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ ఆ పురిటి బిడ్డను వదిలేసి పేగు బంధాన్ని తెంచ్చుకుంది. ఈ అమానవీయ ఘటన తిరుపతి జిల్లా నాయుడుపేట మండల పరిధిలోని మేనకూరు సమీపంలోని నాయుడుపేట – గ్రద్ద గుంట రహదారి పక్కన గురువారం చోటుచేసుకుంది. ఓ పసికందును పాత వస్త్రాల్లో చుట్టిన శిశువు ఏడుపును గుర్తించిన వాహనదారుడు ఆ బిడ్డను చూసి చలించిపోయాడు.
హూటాహుటిన ఆ శిశువును నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందించారు. ప్రస్తుతం శిశువు సురక్షితంగా ఉన్నట్లు వైద్యులు తెలియజేశారు. నాయుడుపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిణి కొడ్రెడ్డి ఉమామహేశ్వరీ, పోలీసులు, అధికారులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శిశువు తల్లిదండ్రుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇదిలా ఉంటే నాయుడుపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిణి ఉమామహేశ్వరీ ఆ శిశువుని అక్కున చేర్చుకుని పాలు పట్టించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శిశువును తిరుపతి శిశు రక్ష సమగ్రా కేంద్రానికి తరలిస్తున్నట్లు ఆమె తెలియజేశారు.