గుంటూరు: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నాగార్జున యూనివర్శిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో గుంటూరు జిల్లా కోర్టు కొట్టివేసింది. విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న తొమ్మిదేళ్ల తర్వాత గుంటూరు జిల్లా న్యాయస్థానం నేడు తీర్పు వెలువరించింది.
వివరాలలోకి వెళితే
2015 జులై 14న నాగార్జున యూనివర్శిటీలో విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యకు పాల్పడింది. ర్యాగింగ్ కారణంగా తాను బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు యువతి సూసైడ్ నోట్ రాసింది. సీనియర్ విద్యార్థుల వేధింపులు తట్టుకోలేకపోతున్నట్లు ఆమె లేఖలో పేర్కొంది. కాగా, అప్పట్లో రిషితేశ్వరి ఆత్మహత్య సంచలనంగా మారింది. బాధితురాలి కుటుంబసభ్యులు, బంధువులు, విద్యార్థి సంఘాలు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణ తుది దశకు చేరుకోగా నేడు గుంటూరు జిల్లా 5వ కోర్టు తీర్పు వెలువరించింది. ఆత్మహత్య కు ఇతరులు ప్రమేయం ఉన్నట్లు బలమైన ఆధారాలు లేకపోవడంతో ఈ కేసును కొట్టివేస్తున్నట్లు కోర్టు పేర్కొంది.
న్యాయం జరగలేదు..
రిషితేశ్వరి కేసుపై న్యాయస్థానం తీర్పు తర్వాత బాధితురాలి తల్లితండ్రులు స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె తల్లి దుర్గాబాయి మాట్లాడుతూ తొమ్మిదేళ్లుగా పోరాడుతున్నామని, న్యాయం జరుగుతుందని భావించామన్నారు. తమకు న్యాయం జరగలేదంటూ ఇంకెవరికీ న్యాయం జరగదని ఆమె అభిప్రాయపడ్డారు. అప్పీల్‌కు వెళ్లాలా లేదా అనే విషయాన్ని ఆలోచిస్తామని చెప్పారు. ఇక పోరాడే ఓపిక లేదని ఆమో ఆవేదన వ్యక్తం చేశారు.
డైరీని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు..
రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ మాట్లాడుతూ.. రిషితేశ్వరి డైరీలను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో అర్థం కావటం లేదన్నారు. డైరీలో అన్ని విషయాలు వివరంగా ఉన్నాయన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా రిషితేశ్వరే డైరి రాసినట్లు నివేదిక ఇచ్చిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు , ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వద్దకు న్యాయం కోసం ఆశ్రయిస్తామని తెలిపారు.