హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పోలీసులపై నాగార్జునసాగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌పై యుద్ధ వాతావరణం కంటిన్యూ అవుతోంది. అటు ఆంధ్రా పోలీసులు, ఇటు తెలంగాణ పోలీసులూ ఇరువైపులా పెద్దఎత్తున మోహరించారు. వందలాదిమంది పోలీసులను రంగంలోకి దింపాయి రెండు రాష్ట్రాలు. 13 గేట్లను కంట్రోల్‌కి తీసుకున్న ఏపీ పోలీసులు… సాగర్ కుడి కాలువకు నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. మరోవైపు, తెలంగాణ పోలీసులు కూడా యాక్షన్‌లోకి దిగారు. 13వ గేటు దగ్గర బారికేడ్లు, ఇనుప ముళ్ల కంచెలను తొలగించే ప్రయత్నం చేశారు. అయితే, ఏపీ పోలీసులు అడ్డుకోవడంతో నాగార్జునసాగర్‌పై యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. 13వ గేట్ నుంచి 26వ గేట్ వరకు స్వాధీనం చేసుకుంది ఏపీ. వేలాది మంది ఆర్మ్డ్ పోలీసులను రంగంలోకి దింపి… 13వ గేటు దగ్గర బారికేడ్లు, ఇనుక ముళ్ల కంచెను వేసింది. దాంతో తెలంగాణ ఏపీ చర్యలపై కృష్ణా బోర్డుకు కంప్లైంట్ చేసింది.
నాగార్జున సాగర్‌లో 13 గేట్లు ఏపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై కేసు నమోదయ్యింది. ఏపీ పోలీసులపై తెలంగాణ పోలీసుల FIR నమోదు చేశారు. నాగార్జున సాగర్ విజయపురి టౌన్ పీఎస్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇందులో A-1గా ఏపీ పోలీస్ ఫోర్స్‌ను పేర్కొంటూ వివరించారు. తెలంగాణ భూభాగంలోకి దౌర్జన్యంగా చొచ్చుకువచ్చారని.. తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ ఫిర్యాదు చేసింది. 500 మంది సాయుధ బలగాలతో.. సాగర్ డ్యామ్‌పైకి ఏపీ పోలీసులు వచ్చారంటూ ఫిర్యాదు చేశారు. ప్రధాన డ్యామ్‌లోని 13 నుంచి 26 గేట్ల వరకూ.. ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేశారు. కుడికాల్వ 5వ గేటు నుంచి ఏపీకి నీళ్లు వదిలారని.. కృష్ణా బోర్డు నిబంధనలకు విరుద్ధంగా..అక్రమంగా నీటిని వదిలారంటూ తెలంగాణ పోలీసుల ఫిర్యాదు చేశారు. దీనిపై 447, 427 సెక్షన్ల కింద కేసు నమోదైంది.