వైసీపీ ఫైర్ బ్రాండ్.. ఏపీ మంత్రి రోజాపై అసమ్మతి సెగ రగులుతోంది. సీట్ల మార్పులు చేర్పుల ప్రక్రియలో ఆమె పేరు వినపించటం లేదు. ఆమె సీటు ఖాయమని దాదాపు రాజకీయ వర్గాలు అంటుంటే.. వైరి వర్గాలు మాత్రం అస్సలు సీటు రాదని తెగేసి చెబుతున్నాయి. కాగా, రోజా రాజకీయ భవితవ్యంపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తనకు సీటు దక్కకూడదు. గెలవకూడదనేది అసమ్మతి వర్గం అసలు సిసలు ప్లాన్‌గా కనిపిస్తోంది. కానీ, రోజా ఆలోచనేంటీ? నగరిలో నిలదొక్కుకుంటారా? లేక అసమ్మతి సెగలతో వికసించకుండానే వాడిపోతారా? అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అందరి కళ్లు అధిష్ఠానం వెలువరించే మూడో లిస్టుపైనే ఉన్నాయి.
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో మంత్రి రోజా వ్యతిరేక గ్రూపులు వైసీపీ టికెట్ దక్కనీయరాదని శత విధాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆమెకు కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ కోసం పనిచేస్తామని అధిష్టానం ఎదుట గగ్గోలు పెడుతున్నాయి. ప్రస్తుతం ఆమెకు టిక్కెట్ ఇచ్చే విషయం సరే.. ఏకంగా పార్టీ నుంచి సస్పెండ్ కత్తి వేలాడుతోంది. వైసీపీలో నెంబర్ టూగా వెలుగొందుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై నగరి మారాణి రోజా అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో.. పార్టీ నుంచి ఆమెకు షోకాజ్ నోటీస్ అందింది. 24 గంటలలో వివరణ ఇవ్వాలని ఈ నోటీసు అదేశం.
రోజమ్మపై చర్చోపచర్చలు
తనకు తప్ప మరెవరికి నగరి టికెట్ ఛాన్సే లేదని మంత్రి తన అనుచరులను ఊరడిస్తున్నారు. ఇంతకీ నగరి టిక్కెట్టు మంత్రి రోజాకు నిజంగా దక్కుతుందా? అసమ్మతి నేతల ప్రయత్నాలు ఫలిస్తాయా?.. ఇదీ అసలు సిసలు హాట్ టాఫిక్. ఈ అంశంపైనే చిత్తూరు జిల్లా నగరి నియోజవర్గం మరోసారి చర్చల్లో నలుగుతోంది. మంత్రి రోజా ఈ నియోజక వర్గం నుంచి మూడోసారి బరిలో ఉంటారా? .. జగన్ ఆమెపై నమ్మకం ఉంచి టికెట్ ఇస్తారా? లేదా? అనే అంశంపై వాడీ వేడీ చర్చ జరుగుతోంది. వైసీపీ గాలి బలంగా వీచిన 2019 ఎన్నికల్లోనే బొటాబొటీ మెజార్టీతో రోజా గట్టెక్కారు. ఇక రెండో సారి గెలిచిన తరువాత నియోజకవర్గంలోని వైసీపీ నేతలతో సత్సంబంధాలు లేవు. ఈ నేపథ్యంలో నగరి నియోజకవర్గంలోని అసమ్మతి వర్గం ఏకమైంది. మంత్రి రోజాకు వ్యతిరేకంగా తాడేపల్లిలోప్లాన్ల మీద ప్లాన్ లు రచిస్తున్నారని సమాచారం.
అసమ్మతి ధ్వంస రచన
చిత్తూరు జిల్లాలో కీలక నేత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచర వర్గంలో నగరి మున్సిపల్ మాజీ చైర్మన్ శాంతి , ఆమె భర్త ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ కె.జె కుమార్,, ధర్మకర్తల మండలి చైర్మన్ చక్రపాణి రెడ్డి, పుత్తూరుమొదలియార్ సామాజిక వర్గ నాయకుడు అమ్ములు, వడమాల పేటజెడ్పీటీసీ సభ్యుడు మురళి రెడ్డి, క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన విజయపురం మండలం వైసీపీ నేత లక్ష్మీపతిరాజు తదితరులంతా మంత్రి రోజాకు వ్యతిరేకులే. . వీరంతా ప్రస్తుతం తాడేపల్లిలోనే మకాం వేశారని సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ మంత్రి రోజాకు టికెట్ దక్కకుండా.. ముఖ్యనేతలపై ఒత్తిడి తెస్తున్నారని, ఎప్పడు సీఎం జగన్దర్బారునుంచిపిలుపువస్తే అప్పడు మంత్రి రోజాకు వ్యతిరేకంగా పూర్తి సమాచారం ఇవ్వటానికి రోజా వైరి వర్గం సర్వసన్నద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది.
అసలెందుకింత వ్యతిరేకత..
రోజా వ్యవహార శైలిపై వ్యతిరేకత రోజు రోజుకూ పెరుగుతోందని సమాచారం. ఆమె కుటుంబ సభ్యుల పెత్తనంపై మరీ అదుపు లేదని, అందుకే నగరిలో పార్టీ పరిస్థితి నానాటికి దిగజారుతోందని..ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్టు అసమ్మతి వర్గం భోగట్టా. ఇసుక ,గ్రావెల్ దందాలు సరే.. స్థానిక నాయకులకు విలువ లేదని, తమను రాజకీయంగా దెబ్బ తీయడానికే ఆమె ప్రయత్నిస్తున్నారని, చిత్తూరు జిల్లా వైసీపీ కోఆర్డినేటర్పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి వీరందరూ ఫిర్యాదులు చేశారు. ఆ తరువాత తర్వాత వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టికీ తీసుకు వెళ్లారనేది రోజా వైరి వర్గాల ప్రచారం. ఆర్థికంగా బలశాలి గాలి ముద్దుకృష్ణమనాయుడు రెండో తనయుడు జగదీష్ తనకు అవకాశం ఇవ్వాలంటూ వైసీపీ ముఖ్యలకు టచ్‌లో వెళ్లడం రోజా వర్గంలో గుబులు రేపుతోంది. మంత్రి రోజా స్థానంలో జగదీష్‌కు అవకాశం ఇస్తే . చిత్తూరు జిల్లాలో చంద్రబాబు సామాజిక వర్గానికి ఒక సీటు ఇచ్చినట్లవుతుందని.. వైసీపీ వర్గాలు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అబ్బే డోకా లేదు : రోజా వర్గం
ఆర్థిక వనరులు సహా నియోజకవర్గంలో బలమైన కేడర్ నాయకులు అసమ్మతి గ్రూపులో లేకపోవడం మంత్రి రోజాకు కలిసి వచ్చే అంశమని ఆమె వర్గం భావిస్తోంది. ఆ లెక్కలతోనే వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఖాయమని రోజా ధీమాతో ఉన్నారు. థర్డ్ లిస్ట్‌లో ఎవరికి ఛాన్స్ ఇస్తారో కాని.. రోజా సెల్ఫ్‌గోల్ తో వివాదాల్లో చిక్కుకోవటమూ ఆమెకు ఇబ్బందికర పరిస్థితేనని రాజకీయ వర్గాల విశ్లేషణ. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితురాలు, వైసీపీలో కీలక నేత, పైగా మంత్రి హోదాలో ఉండి కూడా టిక్కెట్టు కోసం రోజా ఎదురు తెన్నులు చూడటమే అసలు సిసలు హాట్ టాఫిక్ గురూ.