టీడీపీ-జనసేన కలిసి ముందుకు నడుస్తున్నా.. వారితో బీజేపీ నడుస్తుందా? అనే సస్పెన్స్ కొనసాగుతున్న తరుణంలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో నేడు ఉమ్మడిగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ ఇద్దరు నేతలు మాట్లాడుతూ బిజెపితో పొత్తు విషయంపై చర్చించేందుక ఇప్పటికే చంద్రబాబుకు ఢిల్లీ లో ఉన్నారని, ఇక పవన్ కల్యాణ్ నేటి రాత్రికి ఢిల్లీ చేరుకుంటారని చెప్పారు.
ఈ ఇద్దరు నేతలు ఢిల్లీ పెద్దల్ని కలిశాక పొత్తులు, ఇతర అంశాలపై స్పష్టత వస్తుందన్నారు. రేపటి లోగా పొత్తుల విషయంలో ఒక స్పష్టమైన క్లారిటీ వస్తుందని భావిస్తున్నామన్నారు.ఇక ఈ నెల 17వ తేదీన చిలకలూరిపేటలో ఉమ్మడి బహిరంగ సభ నిర్వహణకు నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు నాదేండ్ల మనోహర్, చిలకలూరిపేట సభలో అందరూ భాగస్వామ్యం కావాలన్నారు. వివిధ స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేసి సభను విజయవంతం చేస్తామన్నారు. సూపర్ 6 నినాదంతో అభివృద్ధి లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు.
అర్ధరాత్రి జనసేన కార్యాలయంలోకి పోలీసులు..
గత అర్ధరాత్రి జనసేన కేంద్ర కార్యాలయంలోకి పోలీసులు రావడాన్ని మనోహార్ ఖండించారు. కక్ష పూరితంగానే పవన్ కల్యాణ్ భద్రతా సిబ్బంది, జనసేన టీంలను పోలీసులు భయబ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలను భయపెట్టాలని ప్రయత్నం చేస్తే విఫలం అవుతుందని హెచ్చరించారు. ఇప్పటికే టిడిపి, జనసేన పొత్తుల్ని విచ్ఛిన్నం చేయటానికి కొందరు చేసిన తీవ్ర ప్రయత్నాలు బెడిసికొట్టాయంటూ హాట్ కామెంట్లుచేశారు.
చిలకూరిపేట సభలో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల ..
ఈ నెల 17న తెలుగుదేశం -జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తాం అని తెలిపారు అచ్చెన్నాయుడు.. అలాగే చిలకలూరిపేట బహిరంగ సభ ద్వారా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు..ఇక చిలకలూరిపేట సభకు బస్సులు కేటాయించాలని ఆర్టీసీ ఎండీని కోరారు..ఈ సభకు బస్సులు కేటాయించకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
పోలీసుల తీరు మారకుంటే …
తెలుగుదేశం – జనసేన నేతలపై వేధింపులు మానుకోవాలని పోలీసులకు సూచించారు. పోలీసుల తీరు మారకుంటే న్యాయపరంగా మందుకెళ్తామన్నారు. పోలీసుల వేధింపుల నుంచి పార్టీ శ్రేణుల్ని కాపాడేందుకు ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ 7306299999 ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. వైసీపీ నుంచి రాష్ట్రాన్ని రక్షించాలన్నదే తెలుగుదేశం – జనసేన లక్ష్యం.. తెలుగుదేశం – జనసేన అభ్యర్థుల్ని ప్రకటించాక వైసీపీ వణికిపోతోందన్నారు అచ్చెన్నాయుడు.