ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఏపీలో పర్యటించనున్నారు. సత్యసాయి జిల్లా పాలసముద్రంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ (NACIN) నూతన భవన సముదాయాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (కస్టమ్ అండ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్) 74, 75వ బ్యాచ్ ల ట్రైనీ ఆఫీసర్లతోనూ, రాయల్ సివిల్ సర్వీస్ ఆఫ్ భూటాన్ ట్రైనీ ఆఫీసర్లతోనూ మాట్లాడనున్నారు
మోదీ తన పర్యటన సందర్భంగా NACIN క్యాంపస్ లోని పురాతన వస్తువుల అక్రమ రవాణా అధ్యయన కేంద్రం, నార్కోటిక్స్ అధ్యయన కేంద్రం, వైల్డ్ లైఫ్ క్రైమ్ డిటెక్షన్ సెంటర్ లను సందర్శించనున్నారు. NACIN ప్రాంగణంలో మోదీ ఓ మొక్కను నాటనున్నారు. అక్కడి భవన నిర్మాణ కార్మికులతో ముచ్చటించనున్నారు..
కాగా, ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్ కూడా పాల్గొననున్నారు. ఏపీ పర్యటనలో భాగంగా ప్రధాని తొలుత లేపాక్షిలోని వీరభద్ర ఆలయాన్ని సందర్శించనున్నారు.
కాగా, రాష్ట్ర విభజన చట్టం-2014 కేటాయింపుల్లో భాగంగా ఏపీకి NACIN అకాడమీని కేటాయించారు. ఈ అకాడమీ నిర్మాణానికి 2015లో అప్పటి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ శంకుస్థాపన చేశారు. NACINకి దేశంలోనే ఇది రెండో క్యాంపస్. దీన్ని రూ.730 కోట్ల వ్యయంతో నిర్మించారు.
ప్రధాని పర్యటన షెడ్యూల్ వివరాలు…
ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో బయలుదేరుతారు. 12:55 నిమిషాలకు పుట్టపర్తి ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడినుంచి హెలికాప్టర్లో 12: 55 కు బయలుదేరి 1:20 లకు లేపాక్షి హెలిపాడ్ కు చేరుకుంటారు.1:25 లేపాక్షి హెలిపాడ్ నుంచి కారులో బయలుదేరి వీరభద్ర స్వామి ఆలయం చేరుకుంటారు. అక్కడ 1:30 నుంచి 2:30 దర్శనం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఆలయం నుంచి 2:35 గంటలకు బయలుదేరి లేపాక్షి హెలిపాడ్ కు 2:40 చేరుకొని,2:45 నిమిషాలకు బయలుదేరి, హెలికాప్టర్లో 5:05 నిమిషాలకు పాలసముద్రం వద్ద నిర్మించిన నాసిన్ హెలిపాడ్ చేరుకుంటారు. అక్కడ నుంచి 5:10 కు బయలుదేరి,4:30 గంటలకు నాసిన్ అకాడమీ శిక్షణ కేంద్రానికి చేరుకుంటారు. అక్కడే 3:30 నుంచి 5:00 వరకు అనగా ఒకటిన్నర గంట సేపు అకాడమీ ప్రారంభోత్సవం, శిక్షణ పొందుతున్న వారితో మాట్లాడడం తదితర కార్యక్రమాలలో పాల్గొంటారు. అనంతరం ఐదు గంటల ఐదు నిమిషాలకు నాసిన్ అకాడమీ నుంచి 5:05 బయలుదేరి, హెలిపాడ్ 5:10 చేరుకొని, అక్కడ నుంచి5:15 హెలికాప్టర్లో బయలుదేరి,5:35 పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంటారు.5:40 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి 6: 45 నిమిషాలకు కేరళలోని కొచ్చిన్ చేరుకుంటారు.