తక్కువ కూలీ ఇస్తూ.. ఎక్కువ పనిగంటలతో శ్రమ దోపిడీ చేస్తున్నారని అక్కడి కార్మికులు భగ్గుమన్నారు. కంపెనీ తీరును నిరసిస్తూ పరిశ్రమ ఎదుట భైటాయించి ఆందోళనకు దిగారు. ఈ ఘటన తిరుపతి జిల్లా నాయుడుపేటలో గురువారం జరిగింది. నాయుడుపేట మండలం మేనకూరు పారిశ్రామిక వాడలోని లాయల్ టెక్స్టైల్స్ యాజమాన్యం శ్రమ దోపిడీకి పాల్పడుతోందని కార్మికులు నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు.
జీతాలు సరిగా ఇవ్వడం లేదు..
జీతాలు సరిగా ఇవ్వకుండా కడుపులు మాడుస్తూ కార్మికుల పొట్టకొడుతున్నారని కన్నీటితో కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, పరిశ్రమ ముందు బైటాయించి ఆందోళనకు దిగిన కార్మికులతో యాజమాన్య ప్రతినిధులు శాంతి చర్చలకు వచ్చారు. ఇక.. పరిశ్రమలో పనిచేస్తున్న కొందరి వేధింపులు అధికంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. వందలాది మంది కార్మికుల ఆందోళనతో పరిశ్రమ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ జరిగే మరణాలు కూడా మిస్టరీగా మారడంపై కార్మికులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు.