రాయచోటి, లక్కిరెడ్డిపల్లె (కడప) ప్రభన్యూస్: బతుకుదెరువు కోసం కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలానికి చెందిన వెంకటేష్ మూడేళ్ల క్రితం కువైట్‌కి వెళ్ళాడు. తనకు తోడుగా తన భార్యను కూడా ఇండియా నుంచి కువైట్ కి పిలిపించుకొని , అక్కడ ఇరువురు కష్టపడుతూ కుటు-ంబాన్ని పోషించుకునేవారు. ఏమి జరిగిందో ఏమో తెలియదు కానీ ఉన్నట్టు-ండి వెంకటేష్‌పై హత్యా ఆరోపణ వచ్చింది. ఒకే కుటుంబంలో తల్లిదండ్రులతో పాటు- ఒక యువతిని హత్య చేసిన ఆరోపణలు వెంకటేష్‌పై పడ్డాయి. ఈ కేసులో కువైట్‌లో పోలీసులు రాత్రి వెంకటేష్‌ను అరెస్టు చేసినట్లు- సమాచారం అందింది. వెంటనే అకని భార్య స్వాతిని అక్కడివారు స్వదేశానికి పంపించివేశారు. అయితే 21 రోజులు కస్టడీ విధిస్తున్నట్లు- మొదట్లో తెలిసినప్పటికీ వెంకటేష్ బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడని కుటు-ంబ సభ్యులకు సమాచారం అందించారు. ఉన్నట్టుండి కస్టడీలో ఉన్న వ్యక్తి ఏ విధంగా ఆత్మహత్య చేసుకుంటాడని, ఇది కువైట్ ప్రభుత్వం చేసిన హత్యగానే భావించాల్సి వస్తుందని అభిప్రాయ పడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ వెంకటేష్ మృతి వార్త వినగానే ఆ కుటుంబ సభ్యులు అరణ్యరోదన మొదలైంది.
మృతుని భార్య స్వాతి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది మృతుని కొడుకులు జయవర్ధన్ , విష్ణువర్ధన్‌లు చిన్న పిల్లలు కావడంతో వారికి ఏమి జరిగిందో దిక్కుతోచక దీన స్థితిలో అందరినీ చూస్తుండి పోతున్నారు. వెంకటేష్ తల్లిదండ్రులు శ్రీరాములు, రవణమ్మలు తన ఒక్కగానొక్క కొడుకుని పోగొట్టు-కొని కడచూపు కూడా చూడలేకపోయానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాధేయపడినా ఫలితం శూన్యం కువైట్‌లో తన భర్త వెంకటేష్ పై అనవసరంగా ఏ తప్పు చేయకపోయినా, హత్య కేసు నమోదయిందని , తన భర్తను కాపాడాలని స్వాతి ఎంతో ప్రయత్నం చేసింది. స్వాతి ఇండియాకు వచ్చిన తర్వాత అనేక విధాలుగా రాజకీయంగా, పోలీసు చట్ట పరంగా తన భర్తను కాపాడాలని ప్రాధేయ పడినప్పటికీ ఎటు-వంటి ఫలితం లేకుండా పోయింది. స్వాతి ఇక్కడకు వచ్చినప్పటినుంచి ప్రతిరోజు ఈ ప్రాంత నాయకులతో కలిసి ప్రయత్నాలు చేసింది. కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ను కలిసి తన భర్తను కాపాడాలని వేడుకుంది. అయినా తన భర్తను కాపాడుకోలేక పోయానని కన్నీరు మున్నీరై పోతోంది.- నా భర్త విషయంలో ప్రభుత్వం ఏ న్యాయం చేయలేక పోయింది.
మా బిడ్డలు అనాధలై పోయారు… , ప్రభుత్వమే ఆదుకోవాలి : స్వాతి , మృతుని భార్య
నా భర్త విషయంలో మన ప్రభుత్వం ఎటు-వంటి న్యాయం చేయలేక పోయింది. కువైట్ వారు నా భర్తను ఉద్దేశపూర్వకంగానే హత్య కేసులో ఇరికించారు. నేను ఇండియాకు వచ్చిన తర్వాత అనేక మందిని కలిసి సాయం చేయాలని కోరినా ఫలితం లేకుండా పోయింది. నా భర్త వెంకటేష్‌ను కువైట్ ప్రభుత్వం జైలులోనే హత్య చేసింది. వారు చేసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం నా భర్త మరణాంతరం నేను, నా బిడ్డలు అనాధలైపోయాం. ప్రభుత్వమే నా బిడ్డలను ఆదుకోవాలి.
చేయని నేరానికి నా కొడుకును చంపేశారు : శ్రీరాములు , మృతుని తండ్రి
బ్రతుకుదెరువు కోసం నా కొడుకు వెంకటేష్ ను, నా కోడలు స్వాతి ఇద్దరినీ కువైట్‌కి పంపించాను. వారు సంపాదించిన సంపాదనతోనే ఇద్దరు పిల్లలను(జయవర్ధన్ , విష్ణువర్ధన్) పోషించుకుంటూ, మేమూ కూడా బతుకుతున్నాము. నా కొడుకు చేయని తప్పుకు చంపేశారు. నా ఒక్కగానొక్క కొడుకును కడసారి కళ్లారా చూసుకునే భాగ్యం కూడా లేకుండా పోయింది. కువైట్ ప్రభుత్వం ఇంత దారుణం చేస్తుందనుకోలేదు. సాయం చేయమని అందరినీ బ్రతిమాలినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు మా కుటు-ంబం అంతా అనాధ కుటుంబం అయిపోయింది.