రాష్ట్రంలో పేదరికం లేని కుటుంబ స్థాపనే నా లక్ష్యమని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు.సీబీఎన్ కనెక్ట్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని నిరుద్యోగులు, డాక్టర్లు, లాయర్లు, టీచర్లతో చంద్రబాబు వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాసన మండలిలో ఉపాధ్యాయ సమస్యలపై పోరాడే వారికే ఓటేయండని ఆయన కోరారు. ఒక్కో టీచర్ కు రూ.5 వేలు ఇచ్చి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోందని, అవినీతి డబ్బుతో ఉపాధ్యాయ ఓట్లు కొనేందుకు సిద్ధమయ్యారన్నారు.
టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులు పోటీలో లేకున్నా ఉపాధ్యాయుల భవిష్యత్తు కోసం హెచ్చరిస్తున్నానన్నారు. వైసీపీ అభ్యర్థులకు ఓటేస్తే, మీ జీవితాలకు మీరే ఉరితాళ్లు బిగించుకున్నట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికలయ్యాక మీ జీతాల్లో కోత పెట్టడంతో పాటు ఇతరత్రా అన్ని సౌకర్యాలు లేకుండా చేస్తారని, రాష్ట్రంలో ప్రైవేటు టీచర్లనూ గౌరవించేలా తెలుగుదేశం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అంతే కాకుండా.. ‘ఎందరో జీవితాలను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు నేడు గౌరవం లేకుండా పోయింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పతనమైపోయిందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తొలిగే వ్యవస్థకు శ్రీకారం చుట్టి, తన సొంత కేసులు వాదించిన న్యాయవాదులకు ప్రభుత్వ కేసులు అప్పగించి వారికి జగన్ ప్రజల సొమ్ము దోచిపెడుతున్నారన్నారు. న్యాయ వ్యవస్థకి జగన్మోహన్ రెడ్డి వందల వేల కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. అభివృద్ధిలో పోటీపడిన ఆంధ్రప్రదేశ్ నేడు మనుగడ కోసం పోరాడాల్సి వస్తోందన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం సమష్టిగా పోరాడాల్సిన అవసరం అందరిపైనా ఉందని చంద్రబాబు అన్నారు.