విశాఖపట్నం – ఎంవీపీ కాలనీ: (ఆంధ్రప్రభ): ఒక వైపు కూరగాయల ధరలు రైతుబజార్లను వేధిస్తోంది. మరో వైపు వినియోగదారులను ఏడిపిస్తోంది. కూరగాయలు తెచ్చేందుకు రైతు బజార్లకు వెళ్తున్న వినియోగదారులు అక్కడ దుకాణదారులు ఇచ్చే నాణ్యత లేని కూరగాయలు తప్పనిసరిగా కొని తెచ్చుకుంటున్నారు. ఇది తెచ్చుకోవడానికి కూడా ఒక్కోసారి బారులు తీరాల్సివస్తుంది. నగర వాసులకు, రైతుబజారు రైతులు అందించవలసిన కూరగాయలు పక్కదారి పడుతుంటే వినియోగదారులు చేష్టలుడిగి చూస్తుండిపోవాల్సివస్తుంది. వినియోగదారులకు విక్రయించాల్సిన కూరగాయలు బయట వ్యాపారులకు, హోటల్ యజమానులకు పెద్ద మొత్తంలో దుకాణదారులు నాణ్యమైనవి సేకరించి మరీ ఇచ్చేస్తున్నారు.
ఇదే విధంగా బస్తాల కొద్దీ ఉల్లిని, కూరగాయలుని రైతు బజారులోని రైతులు పధకం ప్రకారం బయట దళారులకు తరలిస్తున్నారు. సుదూర ప్రాంతాలలో ఉన్న రైతులు పండించే కూరగాయలు అక్కడే ఉండిపోకుండా వాటిని నగరంలో ఉన్న రైతు బజార్లలో అమ్మేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు 1999వ సంవత్సరంలో రాష్ట్రంలో రైతు బజార్లు ఏర్పాటు చేసింది. చిన్న మరియు మధ్య తరహా రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సరైన ధరకు విక్రయించడంలో సహాయపడేందుకు మరియు రైతులు ఆర్థికంగా స్థిరంగా ఉండటానికి సహాయపడతాయని రైతు బజార్లు ఏర్పాటు చేశారు.
పట్టణాల్లో మరియు నగర, పట్టణ వాసులు ఈ ఉత్పత్తులను నేరుగా రైతుల నుండి తక్కువ ధరకు పొందుతారని ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడా కూరగాయలు రైతు బజార్ కు వచ్చే వినియోగదారులకు అందట్లేదు. రైతు బజారుకు రాకముందే నేరుగా బయట మార్కెట్లోకి వెళ్లిపోతున్నాయి. దీంతో రైతు బజార్లలో ఉదయం 10 గంటలకే కూరగాయలు అయిపోతుండడంతో బయట మార్కెట్లో రెట్టింపు ధరలతో కూరగాయలు కొనే పరిస్థితి దావరించింది. నగరంలో ఉన్న రైతు బజార్లకు దూర ప్రాంతాల నుండి వేకువజామున నాలుగు గంటలకు బస్సులలో కూరగాయలు తరలిస్తారు. రైతుల కోసం రైతులు కూరగాయలు రైతు బజార్లకు తెచ్చేందుకు ఇబ్బందులు పడకుండా రైతులు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా బస్సులు కూడా ఏర్పాటు చేసింది.
రైతు బజార్లలో రైతులు కూరగాయలు అమ్మిన తరువాత మరల వారిని వాళ్ళ స్వస్థలాలకు చేరేందుకు కూడా బస్సులు ఉపయోగపడుతున్నాయి. కానీ కొంతమంది రైతులు ఆ బస్సులను, కూరగాయలను నేరుగా రైతు బజార్ కు తీసుకువెళ్ళకుండా బయట మార్కెట్లకు తీసుకువెళ్లి దళారులకు కాస్త ఎక్కువ రేట్లకు అమ్మివేస్తున్నారు. మిగిలిన కూరగాయలను మొక్కుబడిగా రైతు బజార్ కు తీసుకువెళ్లి మమ అనిపిస్తున్నారు. దీంతో రైతు బజార్లకు వచ్చే వినియోగదారులు కూరగాయలు లేక బయట మార్కెట్లో అధిక రేట్లకు కొనుక్కొని వెళ్తున్నారు.
ఇదే సంఘటన గురువారం ఉదయం ఎంవీపీ రైతు బజార్ పరిసర ప్రాంతంలో జరిగింది. ఎంవీపీ రైతు బజార్ కు తీసుకువెళ్ళాల్సిన కూరగాయలు బస్సు ఎంవీపీ క్యాన్సర్ హాస్పిటల్ పక్క రోడ్డులో ఓ దుకాణం దగ్గర ఆగింది. ఎంవీపీ రైతు బజార్లో కూరగాయలు అమ్ముతున్న దేవుడు బాబు అనే రైతు బస్సులో ఉన్న సగం కూరగాయాలు ఆ బడ్డీలో దించేసి వెళ్లిపోయాడు. రైతు బజార్ కు వెళ్లాల్సిన కూరగాయలు బయట మార్కెట్ లోకి దించడంతో అక్కడ ఉన్న స్థానికులు తమ చరవాణితో క్లిక్ మనిపించారు. రైతు బజార్లో వినియోగదారులకు అమ్మాల్సిన కూరగాయలు బయట మార్కెట్ కు తరలించడమేమిటని ప్రశ్నిస్తున్నారు.
కొరవడిన పర్యవేక్షణ
నగరంలో ఉన్న రైతు బజార్లలో ప్రతీ రోజు ఏం జరుగుతోందో తెలుసుకోవాల్సిన అవసరం మార్కెటింగ్ శాఖ అధికారులకు ఉంది. కానీ ఆ పరిస్థితి లేదనే చెప్పాలి. నెలలో ఒకసారి రైతు బజార్లకు వచ్జి డ్రాలు తీసి రికార్డులు పరిశీలించామని ఫోటోలకు ఫోజులు ఇచ్చి వెళ్ళిపోతారు. రైతు బజార్లలో ఏం జరుగుతుంది, సకాలంలో రైతులు పండించే కూరగాయలు రైతు బజార్లకు వస్తున్నాయా లేదా, బయట దళారులకు కూరగాయలు వెళ్తున్నాయా లేదా అనే పర్యవేక్షణ కొరవడింది. ఇకనైనా జాయింట్ కలెక్టర్ మార్కెటింగ్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.