Friday, November 22, 2024

పోలవరానికి మనస్ఫూర్తిగా సహకరించాలి, ప్ర‌త్యేక హోదా అమ‌లు చేయాలి: ఎంపీ మిథున్‌రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును స‌కాలంలో పూర్తి చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం మ‌న‌స్పూర్తిగా స‌హ‌క‌రించాలని ఎంపీ మిథున్‌రెడ్డి కేంద్రప్రభుత్వాన్ని కోరారు. వైఎస్సార్సీపీ తరఫున శుక్రవారం లోక్‌సభలో ఫైనాన్స్ బిల్లు-2022పై చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోల‌వ‌రం, ప్ర‌త్యేక‌హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ రాష్ట్ర స‌మ‌స‌ల్య‌ను ప్ర‌స్తావించారు. కేంద్రం అర‌కొర మాట‌లు చెపితే స‌రిపోదని, పోల‌వ‌రంపై ఆర్థిక శాఖ ర‌క‌ర‌కాల‌ స‌మ‌స్య‌లు సృష్టిస్తోందని మిథున్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ న‌ష్టాల్లో లేదన్న ఆయన, ఈ ఏడాది మంచి లాభాలు తీసుకొస్తుందని చెప్పారు. క్యాప్టివ్ మైన్‌లు కేటాయించి విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఆదుకోవాలని అన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ త‌ర‌హాలో విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కూడా స‌హ‌క‌రించాలని కోరారు. ఆత్మనిర్భర్ భారత్ అంటున్న కేంద్రం ఏపీలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 13 మెడిక‌ల్ కాలేజీలు ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో ఫిషింగ్ హార్బ‌ర్‌లు, పోర్టుల ఏర్పాటుకు మ‌ద్ద‌తు ఇవ్వాలని మిథున్ కోరారు. సివిల్ స‌ప్లైస్ కార్పొరేష‌న్‌కు రూ. 1700 కోట్ల బ‌కాయిలు చెల్లించాలని గుర్తు చేశారు. విభ‌జ‌న తర్వాత రాష్ట్రానికి ఆర్థిక వ‌న‌రులు త‌గ్గిపోయాయని, విభ‌జ‌న స‌మ‌యంలో ఇచ్చిన ప్ర‌త్యేక హోదా వాగ్దానాన్ని ఇప్ప‌టికైనా అమ‌లు చేయాలని నొక్కి చెప్పారు. మామిడి రైతుల‌కు టాక్స్ స్లాబ్‌ను 12 శాతంగానే ఉంచాలన్నఎంపీ, ఫుడ్ ప్రాసెసింగ్‌, ఫార్మ‌ర్స్ అసోసియేష‌న్‌తో చ‌ర్చ‌లు జ‌రిపి స‌మ‌స్యను ప‌రిష్క‌రించాలని ప్రభుత్వానికి సూచించారు. ఏపీలో 40 వేల పాఠశాల‌ల‌ను కార్పొరేట్‌కు ధీటుగా అభివృద్ధి చేయడంతో ప్ర‌భుత్వ స్కూళ్ల‌లో అడ్మిష‌న్లు దొర‌క‌ని ప‌రిస్థితి నెలకొందని వివరించారు. నాడు-నేడు ప‌థ‌కం బాట‌లో తెలంగాణ, యూపీ రాష్ట్రాలు ప్ర‌యాణిస్తున్నాయని, ఈ ప‌థ‌కానికి అవసరమైన సహకారాన్ని కేంద్రం అందివ్వాలని వినతి చేశారు.

చెల్లింపులు జ‌ర‌గ‌కుండానే అడ్వాన్స్ జీఎస్టీ ప‌న్ను వేయ‌డం స‌రికాదని మిథున్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 2.50 ల‌క్ష‌ల ఆదాయ‌పు ప‌న్ను ప‌రిమితిని ద్ర‌వ్యోల్బ‌ణానికి అనుగుణంగా స‌వ‌రించాలని, సేవింగ్స్ ఖాతాల‌కు వ‌డ్డీ రేట్లు త‌గ్గించ‌వ‌ద్దని ఆయన సూచించారు. రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ విధించ‌డంపై పున‌రాలోచ‌న చేయాలని అన్నారు. స్టార్ట‌ప్స్ ప్రోత్సాహకాల ప‌థ‌కాల‌లో ఉన్న లోపాలు తొల‌గించి ఎక్కువ మంది ఉప‌యోగించుకునేలా చ‌ర్య‌లు తీసుకోవాలని ఎంపీ స్పష్టం చేశారు. స‌బ్ కా సాత్ – స‌బ్ కా వికాస్ అన్న నినాదాన్ని ఆచ‌ర‌ణ‌లో పెట్టాలని అభిప్రాయపడ్డారు. స‌ర్ ఛార్జీలు, సెస్‌ల పేరిట నిధుల‌న్నీ కేంద్ర‌మే తీసుకుంటోందని, స‌బ్‌కా సాత్ – సెంట‌ర్ కా వికాస్ అన్న త‌ర‌హాలో కేంద్రం విధానాలున్నాయని ఎద్దేవా చేశారు. నిజ‌మైన స‌మాఖ్య వ్య‌వ‌స్థ‌ను అమ‌లు చేయాలని మిథున్ రెడ్డి కేంద్రాన్ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement